TPCC Working President Jagga Reddy: బీజేపీ నీతులు చెప్పాలని చూస్తోంది
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:42 AM
దేశంలో కరెన్సీ నోట్ల మీద మహాత్మాగాంధీ ఫొటో తీసేయాలని మోదీ, అమిత్‌షా కుట్రలు పన్నుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు.
మునిమనవడి వయస్సున్న బీజేపీ.. ముత్తాతలాంటి కాంగ్రె్‌సకు దగ్గు నేర్పుతోంది
చరిత్రను కాలరాయాలని చూస్తోంది
నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పేర్లు దేశంలో వినిపించకూడదని కుట్రలు
నోట్ల మీద మహాత్మాగాంధీ బొమ్మ లేకుండా చేసే కుట్ర జరుగుతోంది
దేశ ప్రజలు సుఖశాంతులతో బతకాలంటే రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలి
కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో జగ్గారెడ్డి
సంగారెడ్డి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దేశంలో కరెన్సీ నోట్ల మీద మహాత్మాగాంధీ ఫొటో తీసేయాలని మోదీ, అమిత్‌షా కుట్రలు పన్నుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తన సతీమణి టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలతో కలిసి జగ్గారెడ్డి.. సంగారెడ్డిలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబ చరిత్రను దేశంలో లేకుండా చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించాలని మహాత్మాగాంధీ నేతృత్వంలో మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇతర పెద్దలు దేశ స్వాతంత్య్రం కోసం శాంతియుత మార్గంలో పోరాటం చేశారని గుర్తు చేశారు. నెహ్రూ క్యాబినెట్‌లో అంబేడ్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉండి సమస్త కులాలు, సమస్త మతాల ప్రజలు స్వేచ్చగా ఉండాలని రాజ్యాంగం రాశారని జగ్గారెడ్డి వివరించారు. దేశ స్వాతంత్య్రం కోసం నెహ్రూ 12 ఏళ్లు జైలు జీవితం గడిపారని, ఇందిరాగాంధీ జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో మోదీ, అమిత్‌షా పాత్ర లేదని.. వారు పుట్టనే లేదన్నారు. గాంధీ, నెహ్రూ, రాహుల్ కుటుంబాలను టార్గెట్ చేస్తూ మోదీ, అమిత్‌షా పని చేస్తున్నారని.. ఈ విషయాన్ని దేశ ప్రజలు గమనించాలని సూచించారు.