Share News

Chief Mahesh Kumar Goud: రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందే బీఆర్‌ఎస్‌

ABN , Publish Date - Oct 01 , 2025 | 02:46 AM

తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్‌ఎస్‌ వాళ్లకు.. అప్పు అనే మాట పలికే అర్హత లేదని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు...

Chief Mahesh Kumar Goud: రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందే బీఆర్‌ఎస్‌

  • వారి బాకీ కార్డును చూసి జనం నవ్వుకుంటున్నారు

  • వాళ్లు చేసిన అప్పును మేం చెల్లిస్తున్నాం

  • కాంగ్రెస్‌ మాట ఇస్తే కట్టుబడి ఉంటుంది బీసీ రిజర్వేషన్లతో మళ్లీ నిరూపితమైంది

  • టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్‌ఎస్‌ వాళ్లకు.. అప్పు అనే మాట పలికే అర్హత లేదని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. ‘‘తెలంగాణను బాకీ రాష్ట్రంగా మార్చిందే బీఆర్‌ఎస్‌. వారు రూ.8 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. వాటిని చెల్లిస్తున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం. ప్రతి నెలా రూ.6500 కోట్ల మేరకు వాయిదాల కింద కట్టాల్సి వస్తోంది. కొత్తగా బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు బాకీ కార్డు అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు’’ అని మహేశ్‌గౌడ్‌ చెప్పారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక 65 వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు; రూ.500కే వంట గ్యాస్‌ ఇస్తున్నందుకు; రుణమాఫీ చేసినందుకు; వరికి బోనస్‌ ఇస్తున్నందుకు; కొత్త రేషన్‌ కార్డులు, సన్నబియ్యం ఇస్తున్నందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం బాకీ పడ్డట్టా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో దిక్కుతోచక బాకీ కార్డు పేరుతో ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వారు ఎంత ప్రయత్నించినా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 80 శాతానికి పైగా సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్‌ పార్టీ గెలిచి తీరుతుందని చెప్పారు. బీజేపీ.. బీసీల నోటికాడ ముద్దను లాక్కునే ప్రయత్నం చేస్తోందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటి గురించి ప్రధాని మోదీని అడిగే దమ్ము రాష్ట్ర ఎంపీలకు లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ మాట ఇస్తే కట్టుబడి ఉంటుందని.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తో అది మరోసారి నిరూపితమైందని చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు కోర్టులో పిల్‌ వేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హైడ్రా ఏర్పాటు దూరదృష్టితో తీసుకున్న నిర్ణయమన్నారు. ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్‌పై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందంటూ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

నేడు ఎమ్మెల్యేలను ప్రశ్నించనున్న పిటిషనర్ల తరఫు న్యాయవాదులు

పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేల్లో నలుగురిపై ప్రారంభమైన విచారణ బుధవారం కొనసాగనుంది. బుధవారం జరిగే విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను ప్రశ్నించనున్నారు.

Updated Date - Oct 01 , 2025 | 02:46 AM