Confusion in Medical PG Exams: వైద్య విద్య పీజీ పరీక్షల్లో గందరగోళం
ABN , Publish Date - Oct 15 , 2025 | 05:02 AM
పీజీ వైద్య విద్య పరీక్షల్లో గందరగోళం నెలకొంది. వార్షిక పరీక్షల నిర్వహణలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారుల నిర్లక్ష్యం మరోమారు బయటపడింది..
ఫొరెన్సిక్ పేపరులో 10 ప్రశ్నలకు బదులు 11
అన్ని ప్రశ్నలకూ జవాబు రాయడం తప్పనిసరి
ఏ ప్రశ్న తొలగించాలో తెలియక తంటాలు
గైనకాలజీలో ఒక పేపరుకు బదులు మరొకటి
ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వాకం
హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): పీజీ వైద్య విద్య పరీక్షల్లో గందరగోళం నెలకొంది. వార్షిక పరీక్షల నిర్వహణలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారుల నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. ఒక పేపరుకు బదులు మరోకటి ఇవ్వడం, పరీక్షా పత్రంలో పది ప్రశ్నలకు బదులు పదకొండు ఇవ్వడం లాంటి తప్పిదాలు ఈ పరీక్షల్లో చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన పరీక్షల్లో రెండేళ్లనాటి రేడియాలజీ పాత పేపరును ఇచ్చిన వైనం తెలిసిందే. ప్రస్తుత పరీక్షల విషయానికి వస్తే.. 13న జరిగిన ఫోరెన్సిక్ పరీక్షలో పది ప్రశ్నలకు బదులు పదకొండు క్వశ్చన్స్ ఇచ్చారు. జాతీయ వైద్య కమిషన్ నిబంధనల మేరకు కేవలం పది ప్రశ్నలే ఇవ్వాలి. ఇతర కోర్సుల్లో మాదిరిగా వైద్యవిద్య పరీక్ష పత్రాల్లో ఆప్షన్స్ ఇవ్వరు. ఇచ్చిన ప్రతి ప్రశ్నకూ కచ్చితంగా జవాబు రాయాల్సి ఉంటుంది. అలా రాసిన జవాబు పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. వాటిని సంబంధిత ప్రొఫెసర్స్ ఆన్‌లైన్‌లో దిద్దుతారు. అయితే ప్రశ్నాపత్రాన్ని దిద్దే క్రమంలో మెడికోలు రాసిన జవాబుకు ఒక్క మార్కు ఇవ్వకున్నా.. కొట్టేసినా.. నిర్ణీత సమయం పాటు జవాబు పత్రాన్ని చూడకపోయినా.. సదరు ప్రొఫెసర్ అందుకు గల కారణాన్ని పేర్కొనాల్సి ఉంటుంది. ఇంత పకడ్బందీగా సాఫ్ట్‌వేర్ ఉంటుంది. కానీ ఈ పరీక్షలో 11 ప్రశ్నలు ఇవ్వడంతో విద్యార్థులు తికమకపడ్డారు. చేసేది లేక అన్నింటికీ జవాబు రాశారు. ఇప్పుడు ఆ 11 ప్రశ్నల్లో దేన్ని తొలగించాలి? అనే నిర్ణయం తీసుకోలేక వర్సిటీ ఉన్నతాఽధికారులు తలలు పట్టుకుంటున్నారు. అదనంగా ఇచ్చిన 11వ ప్రశ్ననే తొలగిస్తారా లేదా మరేదైనా ప్రశ్నను తొలగిస్తారా? ఒకవేళ అలా చేస్తే సాంకేతిక ఎదురయ్యే సమస్యను ఎలా అధిగమిస్తారన్నది ప్రశ్నగా మిగిలింది. ఈనెల 7న జరిగిన గైనకాలజీ పేపర్‌లోనూ గందరగోళం నెలకొంది. ఆ రోజు.. విద్యార్థులకు గైనకాలజీ మొదటి పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం ఇవ్వాల్సి ఉండగా, మూడో పేపరు ఇచ్చారు. విద్యార్థులుఈ విషయాన్ని ఇన్విజిలేటర్స్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. అరగంట తర్వాత.. ఆ రోజు ఇవ్వాల్సిన పేపర్‌ను అందజేశారు. ఈ నేపథ్యంలో.. హెల్త్ వర్సిటీ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వినిపిస్తున్నాయి.