Share News

Engineering Colleges: ఏఐఎంఎల్‌ సీటు 25 లక్షలు

ABN , Publish Date - Sep 23 , 2025 | 07:25 AM

బి-క్యాటగిరీలో యాజమాన్య కోటా సీట్లను ప్రతిభ ఆధారంగా కేటాయించడం లేదంటూ ఇంజనీరింగ్‌ కాలేజీలపై భారీగా ఫిర్యాదులు అందాయి. ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా 30 శాతం సీట్లను యాజమాన్యాలు అమ్ముకోవచ్చు

Engineering Colleges: ఏఐఎంఎల్‌ సీటు 25 లక్షలు

  • బి-క్యాటగిరీ సీట్ల కేటాయింపులో..

  • 20 ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీలపై భారీగా ఫిర్యాదులు

  • ఎంపికైన విద్యార్థుల జాబితా, ర్యాంకులు ప్రకటించలేదు

  • విద్యార్థులు, తల్లిదండ్రుల ఫిర్యాదు

  • వివరణ కోరిన ఉన్నత విద్యామండలి

బి-క్యాటగిరీలో యాజమాన్య కోటా సీట్లను ప్రతిభ ఆధారంగా కేటాయించడం లేదంటూ ఇంజనీరింగ్‌ కాలేజీలపై భారీగా ఫిర్యాదులు అందాయి. ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా 30 శాతం సీట్లను యాజమాన్యాలు అమ్ముకోవచ్చు. అయితే దీనికీ ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయి. తొలి ప్రాధాన్యంప్రవాస భారతీయులకు(ఎన్‌ఆర్‌ఐ) ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత జేఈఈ ర్యాంకు ఆధారంగా ప్రతిభగల వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ రెండు విభాగాల్లో పూర్తవకుంటే ఎప్‌సెట్‌ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పించాల్సి ఉంది. అయితే నగరంలోని ఇంజినీరింగ్‌ కాలేజీలు తెలంగాణ ఉన్నత విద్యామండలి జూన్‌ 17న ప్రకటించిన మార్గదర్శకాలను ఎక్కడా పాటించలేదని, ఇష్టారాజ్యంగా సీట్లు అమ్ముకున్నారని అనేక మంది ఫిర్యాదు చేశారు. కొన్ని కాలేజీలు డొనేషన్లు వసూలు చేశారని తల్లిదండ్రులు ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేశారు. ఎంపిక చేసిన విద్యార్థుల జాబితా, వారికి వచ్చిన జేఈఈ ర్యాంకు, ఎప్‌సెట్‌ ర్యాంకుల వివరాలు ప్రకటించలేదన్నారు. కంప్యూటర్‌ సైన్స్‌-ఏఐఎంఎల్‌ బ్రాంచికి ఈసారి భారీగా ఉన్న డిమాండ్‌తో కొన్ని ప్రముఖ కాలేజీలు గరిష్ఠంగా రూ. 25 లక్షల వరకు డొనేషన్ల రూపంలో వసూలు చేశాయని, దానికి ఎలాంటి రసీదులు ఇవ్వలేదని తల్లిదండ్రులు పేర్కొన్నారు. యాజమాన్య కోటా సీట్ల ప్రక్రియ ముగిసినందున.. కాలేజీలు పంపే జాబితాను ఉన్నత విద్యామండలి ఆమోదిస్తేనే బి-క్యాటగిరీ సీట్ల ప్రవేశాలు కొనసాగుతాయి. ఈ సీట్ల పరిశీలన ప్రక్రియ సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ప్రారంభమైంది. ఇప్పటికే విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 20 కాలేజీలకు ఉన్నత విద్యామండలి అధికారులు సోమవారం సంజాయిషీ నోటీసులు పంపారు.

Updated Date - Sep 23 , 2025 | 07:26 AM