Supreme Court lawyer Prashant Bhusha: సందేహాస్పదంగా న్యాయవ్యవస్థ స్వతంత్రత
ABN , Publish Date - Sep 29 , 2025 | 04:12 AM
న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం తదితర రాజ్యాంగ వ్యవస్థలను మోదీ ప్రభుత్వం ప్రభావితం చేస్తోందని సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విమర్శించారు...
నియామకాల్లో పారదర్శకత అవసరం
సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం తదితర రాజ్యాంగ వ్యవస్థలను మోదీ ప్రభుత్వం ప్రభావితం చేస్తోందని సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విమర్శించారు. తద్వారా దేశ సంస్కృతి, ఆత్మను నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రశాంత్ భూషణ్ కీలకోపన్యాసం చేశారు. కొంతమంది న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన వెంటనే ప్రభుత్వ పదవులను పొందడం చూస్తుంటే న్యాయవ్యవస్థ స్వతంత్రతపైనే అనుమానాలు రేకెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. బిహార్‌లో జరిగిన ఓట్ల గల్లంతుకు సమాధానం ఇవ్వకుండా ప్రతిపక్షాలపై ఎన్నికల సంఘం ఎదురు దాడికి దిగడం ద్వారా బీజేపీకి బీ-టీమ్‌గా మారిందన్న విమర్శలను మూటగట్టుకుందని అన్నారు. కేంద్రం జారీ చేసిన ఆధార్, ఓటరు కార్డులను పరిగణలోకి తీసుకోకుండా ప్రజల దగ్గర లేని 11 రకాల పత్రాలు ఉంటేనే ఓటు హక్కు పొందడానికి అర్హులని అనడం హాస్యాస్పదమని అన్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థలను తమ జేబు సంస్థలుగా బీజేపీ వాడుతోందని దుయ్యబట్టారు. స్వాతంత్య్ర సమరయోధుడు కందిమళ్ల ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ఈవీఎంలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టాలని ప్రశాంత్ భూషణ్‌ను కోరారు. శాంతి చర్చలకు సానుకూలమని ప్రకటించిన తర్వాత కూడా కొన్ని వందల మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ పేరుతో చంపడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు.