Crime Against Women: ఎమర్జెన్సీ వార్డులో యువతిపై కాంపౌండర్ అత్యాచారం
ABN , Publish Date - Sep 08 , 2025 | 02:33 AM
అనారోగ్యంతో ఆస్పత్రిపాలై ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న ఓ యువతి అత్యాచారానికి గురైంది. ..
చికిత్స పొందుతున్న ఆమెకు మత్తుమందు ఇచ్చి లైంగికదాడి
కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఘటన
పోలీసుల అదుపులో నిందితుడు.. పరారీలో ఆస్పత్రి వైద్యుడు
కరీంనగర్ క్రైం, సెప్టెంబరు7 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో ఆస్పత్రిపాలై ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న ఓ యువతి అత్యాచారానికి గురైంది. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న ఆమెకు మత్తుమందు ఇచ్చి ఆ ఆస్పత్రికి చెందిన ఓ కాంపౌండర్ లైంగిక దాడికి తెగబడ్డాడు. ఎమర్జెన్సీ వార్డు బయట బాధిత యువతి కుటుంబసభ్యులు ఉండగానే దారుణానికి ఒడిగట్టాడు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరగ్గా.. బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటికొచ్చింది. ఈ ఘటనకు సంబంధించి కరీంనగర్ మూడో ఠాణా సీఐ జాన్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జగిత్యాలకు చెందిన యువతి(20) అనారోగ్యంతో బాధపడుతూ కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో కొద్దిరోజులుగా చికిత్స పొందుతుంది. ఆ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పని చేసే దక్షిత్ అలియాస్ దక్షిణామూర్తి ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మత్తుమందు ఇచ్చి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆ యువతి తన కుటుంబసభ్యులకు చెప్పింది. ఘటన జరిగిన సమయంలో బాధితురాలి కుటుంబసభ్యులు వార్డు బయటే ఉన్నారు. బాధితురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన జరిగిన ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డును వెంటనే సీజ్ చేశారు. క్రిటికల్ కేర్ యూనిట్‌లోని సీసీ కెమెరా ఫుటేజీలతోపాటు, ఇతర వస్తువులు, ఆస్పత్రి సీసీ కెమెరా ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. ఆస్పత్రి వైద్యులతోపాటు ఘటన జరిగిన సమయంలో ఉన్న సిబ్బంది, రోగులను విచారిస్తున్నారు. నిందితుడు దక్షిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. సదరు ఆస్పత్రి వైద్యుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలిసింది.