Cheques Distributed: బస్సు ప్రమాద బాధితులకు పరిహారం చెక్కుల పంపిణీ
ABN , Publish Date - Nov 05 , 2025 | 03:45 AM
చేవెళ్ల బస్సు ప్రమాదంలో మరణించిన 19 మంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చెక్కుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది...
19 మంది మృతులకు రూ.7 లక్షల చొప్పున సాయం
రేపటివరకు పంపిణీ పూర్తి చేసే అవకాశం
ఓ కుటుంబానికి చెక్కు అందజేసిన స్పీకర్
తనవంతు సాయంగా మరో రూ.లక్ష ఇచ్చిన ప్రసాద్‌కుమార్
వికారాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): చేవెళ్ల బస్సు ప్రమాదంలో మరణించిన 19 మంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చెక్కుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు చెక్కులు సిద్ధం చేసిన అధికారులు మంగళవారం నుంచి పంపిణీ చేపట్టారు. మరణించిన ఒక్కొక్కరి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు, ఆర్టీసీ తరపున రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.7 లక్షల పరిహారం చెక్కులు అందజేస్తున్నారు. క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున ఇస్తారు. గురువారం నాటికి బాధిత కుటుంబాలందరికి పరిహారం చెక్కులు అందజేస్తామని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా మృతులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల వంతున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ప్రమాదంలో మృతిచెందిన వికారాబాద్ పట్టణం శ్రీరాంనగర్ (ధన్నారం తండా)కు చెందిన తారీబాయి ఇంటికి మంగళవారం నాడు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ స్వయంగా వెళ్లారు. ఈ సందర్భంగా తారీబాయి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.7 లక్షల పరిహారం చెక్కుతో పాటు తనవంతు సాయంగా రూ.1లక్ష అందించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పీకర్ భరోసా ఇచ్చారు. ఘటనలో చనిపోయిన 19 మందిలో వికారాబాద్ జిల్లాకు చెందిన వారు 15 మంది ఉన్నట్లు సమాచారం.