Share News

TPCC Chief Mahesh Kumar Goud on BC Reservations: సుప్రీంలో సానుకూల తీర్పు ఆశిస్తున్నాం

ABN , Publish Date - Oct 14 , 2025 | 03:04 AM

ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలకు వెళ్లాలనే సంకల్పంతో ఉన్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు...

TPCC Chief Mahesh Kumar Goud on BC Reservations: సుప్రీంలో సానుకూల తీర్పు ఆశిస్తున్నాం

  • 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు..

  • మంత్రుల మధ్య విభేదాలు చిన్న సమస్య

  • టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌.. ఖర్గేకు పరామర్శ

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలకు వెళ్లాలనే సంకల్పంతో ఉన్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేసే విషయంలో ఇప్పటికే సీనియర్‌ న్యాయవాదులతో చర్చించామని చెప్పారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ఒకటికి రెండు సార్లు అన్నీ సరిచూసుకున్నాకే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామని, న్యాయ నిపుణులు మరోసారి అన్నింటిని పరిశీలిస్తున్నారని తెలిపారు. ఏ క్షణమైనా పిటిషన్‌ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సోమవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసి మహేశ్‌ గౌడ్‌ పరామర్శించారు. అనంతరం తెలంగాణభవన్‌లోని శబరి బ్లాకులో మీడియాతో మాట్లాడారు. ఖర్గే పూర్తిగా కోలుకున్నారని, ఎంతో ఉత్సాహంగా మాట్లాడారని తెలిపారు. అలాగే, ఇటీవల రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, బీసీ రిజర్వేషన్ల అంశం, సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసే విషయం సహా అన్నింటిపై చర్చించామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టులో మాదిరే.. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు సైతం సుప్రీంకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్లు దాఖలు చేసే అవకాశముందన్నారు.సుప్రీంకోర్టులో సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. మంత్రుల మధ్య విభేదాలు చిన్న సమస్యని, కాంగ్రెస్‌ కుటుంబంలో అంతరాలు ఏర్పడితే కూర్చుని మాట్లాడుకుంటామన్నారు. చిన్న, చిన్న విషయాల్లో సమాచార లోపంతోనే స్పర్థలు నెలకొంటున్నాయని, అన్నింటినీ సామరస్యంగా పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు.

డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తులివ్వండి..

జిల్లా కాంగ్రెస్‌ కమిటీ(డీసీసీ) అధ్యక్ష పదవిని ఆశిస్తున్న పార్టీ సీనియర్‌ నాయకులు ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్న ఏఐసీసీ పరిశీలకులను కలిసి దరఖాస్తులు ఇవ్వాలని మహేశ్‌గౌడ్‌ ఓ ప్రకటనలో సూచించారు. డీసీసీ అధ్యక్షుల ఎంపికలో ఏఐసీసీ నాయకత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని, సమర్థ నాయకత్వానికే పట్టం కట్టనుందని వెల్లడించారు. ఇక ముందు డీసీసీ అధ్యక్షులు పార్టీలో ప్రత్యేక భూమికను పోషించనున్నారన్నారు. టీపీసీసీ, ఇతర ముఖ్య సమావేశాలకు వీరు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారని.. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనూ కీలక పాత్ర పోషించనున్నారని పేర్కొన్నారు.

Updated Date - Oct 14 , 2025 | 03:04 AM