శుభకార్యానికి వచ్చి మృత్యుఒడికి
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:44 AM
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో ఆదివారం మధ్యాహ్నం ఓ లారీ బీభత్సం సృష్టించింది.
భువనగిరిలో లారీ బీభత్సం అదుపుతప్పి దూసుకెళ్లిన వైనం
ఇద్దరు మృతి, ధ్వంసమైన వాహనాలు
భువనగిరి టౌన్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో ఆదివారం మధ్యాహ్నం ఓ లారీ బీభత్సం సృష్టించింది. స్థానిక జగదేవ్‌పూర్ చౌరస్తా వద్ద అదుపుతప్పిన లారీ పాదచారులు, నిలిపి ఉన్న వాహనాలు, మూసి ఉన్న దుకాణాల పైకి దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు గాయాలపాలయ్యారు. రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాహనాలు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జగదేవ్‌పూర్ వైపు నుంచి వస్తున్న లారీ అదే చౌరస్తాలో హైదరాబాద్ వైపు తిరుగుతున్న క్రమంలో అదుపుతప్పి దూసుకెళ్లింది. దుకాణం సమీపంలో నిల్చున్న జహీరాబాద్ జిల్లా కోహిర్ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ ప్రైవేట్ సంస్థ మేనేజర్ చిలమామిడి రామకృష్ణ(35), అతని సోదరుడి కుమారుడు, కారు డ్రైవర్ చిలమామిడి సాయికుమార్ (27)లు లారీ, డబ్బా దుకాణాల మధ్య ఇరుక్కొని కొద్దిసేపు విలవిల్లాడారు. రామకృష్ణ అక్కడికక్కడే మృతిచెందగా, సాయి కుమార్‌ను హైదరాబాద్ తరలిస్తుండగా మృతి చెందారు. వీరు జీవనోపాధి కోసం కుటు ంబాలతో మేడ్చల్ జిల్లా సూరారంలో నివాసం ఉంటున్నారు. ఓ శుభకార్యంలో పాల్గొనే ందుకు భువనగిరి వచ్చిన దుర్మ రణం చెందారు. ఈ ప్రమాదంలో రామన్నపేట మండల ఇంద్రపాలనగరానికి చెందిన బిమారి సాయికుమార్ ఎడమకాలు విరగ్గా, ఇద్దరు పాదచారులతో పాటు లారీ డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. మూడు ద్విచక్ర వాహనాలు, రెండు ద ుకాణాలు పాన్ షాప్, టీ స్టాల్ ధ్వంసమయ్యాయి. ఆ దుకాణాలు కూడా మూసి ఉండటం, వినియోగదారులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమా దం తప్పింది. బాధితుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పట్టణ ఇన్స్ పెక్టర్ రమేష్ కేసునమోదు చేయగా ఎస్‌ఐ లక్ష్మీనారాయణ దర్యాప్తు చేస్తున్నారు.
భీతిల్లిన చూపరులు..
కళ్లెదుటే జరిగిన ఘోర ప్రమాదంతో చూపరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. క్షణాల వ్యవధిలో అదుపుతప్పిన లారీ దూసుకురావడం, రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులు మృతి చెందడం, వాహనాలు, దుకాణాలు ధ్వంసం కావడంతో స్థానికులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. చౌరస్తాలోని ట్రాఫిక్ సిగ్నల్ పడేలోపు దాటే ప్రయత్నంలో డ్రైవర్ లారీని వేగంగా నడపడంతో అదుపుతప్పి ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు. లారీకి, గోడకు మధ్య ఇరుక్కున్న మృతదేహాన్ని అరగంటకు పైగా సమయం పట్టింది.
శుభకార్యానికి వచ్చి... మృత్యుఒడికి చేరి
వరుసకు తండ్రీకుమారులైన ఇద్దరూ శుభకార్యానికి వచ్చి మృతి చెందడంతో శుభకార్యం జరగాల్సిన భువనగిరి ఇంటిలో, మృతుల కుటుం బాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. శుభకార్యానికి అవసరమైన సామాగ్రి తీసుకునేందుకు వచ్చి మిఠాయి దుకాణం సమీపంలో నిల్చున్న వీరిద్దరిపై దూసుకురాగా, కొంతమంది తప్పించుకున్నారు. ఈ ఘటనలో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతోనైనా చౌరస్తాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాల వేగ నియంత్రణకు పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
రోడ్డు వెంట ఆక్రమణలు తొలగించాలి : ఎమ్మెల్యే కుంభం
భువనగిరి పట్టణ రహదారుల వెంట ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పోలీసులను, మునిసిపల్ అధికారులను ఆదేశించారు. లారీ బీభత్సం సృష్టించిన జగదేవ్‌పూర్ చౌరస్తాను ఆయన పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. రహదారుల వెంట దుకాణాల ప్రకటనల బోర్డులను తొలగించాలని, చౌరస్తాల్లో పాదచారులు ఎవరూ గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, వందఫీట్ల పట్టణ ప్రధాన రహదారి నిర్వహణలోపం కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రహదారిని విస్తరించినప్పటికీ జాగ్రత్త చర్యలను అధికారులు విస్మరించారన్నారు. జీబ్రాలైన్స్ తదితర ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.