Share News

Jubilee Hills By Election: ఈవీఎంలపై కలర్‌ ఫొటోలు

ABN , Publish Date - Oct 09 , 2025 | 05:03 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఈవీఎంలపై అభ్యర్థుల కలర్‌ ఫొటోలు ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు...

Jubilee Hills By Election: ఈవీఎంలపై కలర్‌ ఫొటోలు

  • రాష్ట్రంలో తొలిసారి జూబ్లీహిల్స్‌లో అమలు.. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కర్ణన్‌ భేటీ

  • ఎన్నికల నియమావళిపై ప్రజెంటేషన్‌

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఈవీఎంలపై అభ్యర్థుల కలర్‌ ఫొటోలు ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. తెలంగాణలో ఈ విధానాన్ని తొలిసారిగా అమలు చేస్తున్నామని చెప్పారు. బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కర్ణన్‌ సమావేశం నిర్వహించారు. స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. కోడ్‌ అమలులో ఉన్నందున ఏం చేయాలి..? ఏం చేయవద్దు.. అన్న అంశాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి ప్రచారం నిర్వహించాలన్నారు. ఉల్లంఘనలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులపై ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. ప్రైవేట్‌ ఆస్తులపై అనుమతి తీసుకొని ప్రకటనలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. అనుమతి లేకుండా ఎవరైనా బ్యానర్లు, ఫ్లెక్సీలు, ఇతర ప్రకటనలు ఏర్పాటుచేస్తే.. ఆ వ్యయాన్ని అభ్యర్థి ఖాతాలో వేస్తామని చెప్పారు.

షేక్‌పేట తహసీల్దార్‌ ఆఫీసులో నామినేషన్లు...

ఈ నెల 13 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఇక్కడే నామినేషన్లు దాఖలు చేయాలి. సికింద్రాబాద్‌ ఆర్‌డీవో సాయిరాం రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్‌ అనుమతి ఉండదని, కేంద్రాల వద్ద మొబైల్‌ డిపాజిట్‌ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని కర్ణన్‌ చెప్పారు. అభ్యర్థుల నేర చరిత్రను పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో ప్రకటనల ద్వారా వెల్లడించాలని పేర్కొన్నారు. పార్టీలు నేర చరిత ఉన్న వారిని ఎందుకు ఎంపిక చేశాయో..? స్పష్టం చేయాలన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం వరకే ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందని తెలిపారు. ఎవరైనా నియోజకవర్గం వెలుపల నగదు, మద్యం పంపిణీ, ఇతరత్రా ప్రలోభాలకు గురిచేస్తున్నట్టు గుర్తిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు బల్దియాలోని సీపీఆర్‌వో ఆఫీసులో మోడల్‌ కోడ్‌ మానిటరింగ్‌ కమిటీ(ఎంసీఎంసీ) కార్యాలయాన్ని కర్ణన్‌ ప్రారంభించారు. పత్రికలు, ప్రసార, సామాజిక మాధ్యమాల్లో ప్రకటనల జారీకి కమిటీ నుంచి పార్టీలు, అభ్యర్థులు అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించి టోల్‌ఫ్రీ నంబర్‌ 1950, సీ విజిల్‌ మొబైల్‌ యాప్‌లో 24 గంటలపాటు ఫిర్యాదు చేయవచ్చని కర్ణణ్‌ తెలిపారు.


శ్రీనగర్‌ కాలనీలో వాహనాల తనిఖీలు 4.60 లక్షల నగదు, 9 మద్యం బాటిళ్లు స్వాధీనం

పంజాగుట్ట, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. పంజాగుట్ట పోలీసులు, ఎన్నికల నిఘా బృందం శ్రీనగర్‌ కాలనీ ప్రధాన రహదారిలో బుధవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. శ్రీనగర్‌ కాలనీ నుంచి అమీర్‌పేట షాలిమార్‌ జంక్షన్‌ వైపు నిర్వహించిన తనిఖీల్లో ఓ కారులో రూ.4.60 లక్షల నగదు, మరో కా రులో 9 చివాస్‌ రీగల్‌ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనల మేరకు రూ.50 వేలకన్నా ఎక్కువ నగదు తీసుకెళ్లేవారు తమవద్ద నగదుకు సంబంధించిన పత్రాలు ఉంచుకోవాలని పోలీసులు, అధికారులు సూచించారు.

ఈసీ నియంత్రణలోకి పోలీసు యంత్రాంగం

హైదరాబాద్‌, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): వచ్చేనెల 11న జరగనున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలోని కీలక పోలీసు అధికారులు ఎన్నికల కమిషన్‌ నియంత్రణలోకి వెళ్లారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వీరు డిప్యూటేషన్‌పై ఈసీ అజమాయిషీలో పనిచేయనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 13 నుంచి నవంబరు 16 వరకు ఈ నియంత్రణ కొనసాగనుంది. డీజీపీ, శాంతి భద్రతల అదనపు డీజీపీ, డీజీపీ కార్యాలయంలోని ఐజీ, డీఐజీ, నియోజకవర్గ పరిధిలోని డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌, అడిషనల్‌ డీసీపీ, సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారులు, సీఐలు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఏఎ్‌సఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లందరూ ఈసీ అజమాయిషీలోనే పనిచేయనున్నారు.

Updated Date - Oct 09 , 2025 | 05:03 AM