Share News

Revenue Secretary Lokesh Kumar: 2 నెలలుగా అడుగుతున్నా స్పందించరా?

ABN , Publish Date - Oct 23 , 2025 | 05:48 AM

నిషేధిత భూముల జాబితాల 22ఏను రెండు నెలలుగా అడుగుతున్నా స్పందించకపోవడంపై రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు..

Revenue Secretary Lokesh Kumar: 2 నెలలుగా అడుగుతున్నా స్పందించరా?

  • ‘నిషేధిత భూముల జాబితా’ తయారీలో జాప్యం ఎందుకు?

  • 22ఏ జాబితాను అప్‌లోడ్‌ చేయని కలెక్టర్లపై చర్యలు

  • షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తాం

  • రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్‌ హెచ్చరికకలెక్టర్లు సంతకాలు పెట్టడం లేదని అదనపు కలెక్టర్ల ఫిర్యాదు

హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): నిషేధిత భూముల జాబితాల (22ఏ)ను రెండు నెలలుగా అడుగుతున్నా స్పందించకపోవడంపై రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 22ఏ జాబితా తయారు చేసి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పంపడంతోపాటు ఽభూభారతి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని చెబుతుంటే పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. బుధవారం అదనపు కలెక్టర్ల (రెవెన్యూ)తో సమావేశం నిర్వహించిన ఆయన.. 22ఏ జాబితాల తయారీలో జాప్యంపై నిలదీశారు. స్పందించిన అదనపు కలెక్టర్లు.. తాము వివరాలు ఇచ్చినా కలెక్టర్లు సంతకాలు పెట్టకపోవడంతోనే జాప్యం జరుగుతోందని చెప్పడంతో లోకేశ్‌కుమార్‌ మరింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జిల్లాల వారీగా 22ఏ జాబితాలను భూభారతి పోర్టల్‌లో ఎందుకు అప్‌లోడ్‌ చేయలేదని ప్రశ్నించారు. ఈ విషయమై స్పందించని; 22ఏ జాబితా తయారు చేసినా సంతకాలు పెట్టని కలెక్టర్లకు షోకాజు నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ఎందుకు పంపడం లేదని హైకోర్టు ఆగస్టులో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అత్యవసర ప్రాతిపదికన వివరాలు పంపాలని, ఆ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేయాలని సెప్టెంబరు 6న విచారణ సందర్భంగా సీఎ్‌సని ఆదేశించింది. ఈ నేపథ్యంలో లోకేశ్‌కుమార్‌ మండలాల వారీగా నిషేధిత భూముల వివరాలను వారం రోజుల్లో పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.

ఇప్పటికీ పాత జాబితానే..

భూభారతి చట్టం అమల్లోకి వచ్చాక కూడా ధరణిలో ఉన్న నిషేధిత భూముల వివరాలే భూభారతి పోర్టల్‌లోనూ పెట్టారు. ఏ కారణం లేకుండానే కొంత మంది భూములను నిషేధిత జాబితాలో పెట్టడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 2016లోనే పలు జిల్లాల్లో తహసీల్దార్లు నిషేధిత ఆస్తుల జాబితాను కలెక్టర్లకు పంపించగా.. ఉన్నతస్థాయి ఒత్తిళ్లతో ఆ జాబితా గెజిట్‌ నోటిఫికేషన్‌కు నోచుకోలేదు. 2017లో భూరికార్డుల నవీకరణ జరిగింది. ఆ సమయంలో నిషేధిత భూముల వివరాలపై స్పష్టత వచ్చింది. వాటి ఆధారంగా జాబితాను సిద్ధం చేసి.. వెబ్‌సైట్‌లో పెట్టాల్సి ఉన్నా ఆ పని చేయలేదు. 22ఏ భూముల జాబితాను గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సర్కారు భూములను గంపగుత్తగా అమ్ముకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Oct 23 , 2025 | 05:48 AM