Cold Wave: కోహీర్‌లో 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత
ABN , Publish Date - Dec 21 , 2025 | 05:38 AM
రాష్ట్రంలో పలు జిల్లాలు చలి పులి పంజాకు విలవిలలాడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గిపోగా..
సిర్పూర్(యు)లో 4.8, అర్లి(టి)లో 5.9
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్: రాష్ట్రంలో పలు జిల్లాలు చలి పులి పంజాకు విలవిలలాడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గిపోగా.. శనివారం మరింత తగ్గి జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో శనివారం ఉదయం 4.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. ఇది ఇప్పటి వరకు రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత. మెదక్ జిల్లా దామరంచలో 7.2, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్‌లో 7.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సుమారు 60 ప్రాంతాల్లో శనివారం ఉదయం ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. పదిహేను రోజులుగా కోహీర్ ప్రాంతం చలి గుప్పిట్లో చిక్కుకుంది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండలంలో శనివారం 4.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. తిర్యాణి మండలం గిన్నెధరిలో 5.1, కెరమెరిలో 7.6, చింతలమానేపల్లిలో 8.7, బెజ్జూరులో 8.9, రెబ్బెనలో, వాంకిడి, జైనూరు, సిర్పూర్(టి) మండలాల్లో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి(టి)లో 5.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బోరజ్‌లో, బజార్‌హత్నూర్, ఆదిలాబాద్ రూరల్‌లో, తాంసిలో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం చిన్న మావందిలో 8.2, నిజామాబాద్ నగరంలో 8.7, మోపాల్ మండలం మంచిప్పలో 9.3, సాలూరలో 9.3, నిజామాబాద్ సౌత్‌లో 9.4, కోటగిరిలో 9.5, మెండోర, డిచ్‌పల్లిలో 9.6, పాల్దాలో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలో గాంధారి మండల కేంద్రంలో 7.4, మద్నూర్ మండలం మేనేర్‌లో 7.7, గాంధారి మండలం సర్వాపూర్‌లో 8, నసురుల్లాబాద్ 8.7, పాల్వంచ మండలం ఎల్పుగొండలో 8.6, బీర్కూర్‌లో 8.8, డొంగ్లీలో 9, మాచారెడ్డి మండలం లచ్చాపేటలో 9.4, రామారెడ్డిలో 9.6, మహ్మద్ నగర్ మండలం ముగ్దాంపూర్‌లో 9.7, నాగిరెడ్డిపేటలో 9.8, నిజాంసాగర్ మండలం హాసన్‌పల్లిలో 9.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని తోటపల్లిలో శనివారం 8.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తెల్కపల్లిలో 8.8, అమ్రాబాదులో 8.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.