Constituency Issues: ఆ ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్
ABN , Publish Date - Sep 19 , 2025 | 07:11 AM
రాష్ట్రంలో ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. అటవీశాఖ అధికారులతో ఓ మంత్రి సమీక్ష నిర్వహించడం దీనికి దారితీసింది.
అటవీ అధికారులతో ఓ మంత్రి సమీక్ష నిర్వహించడంపై ఆ శాఖ మంత్రి ఆగ్రహం
తనకు తెలియకుండా ఎలా నిర్వహిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు
తన నియోజకవర్గ సమస్యలపైనే సమీక్ష జరిపానన్న మరో మంత్రి
హైదరాబాద్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. అటవీశాఖ అధికారులతో ఓ మంత్రి సమీక్ష నిర్వహించడం దీనికి దారితీసింది. తనకు తెలియకుండా తన శాఖ అధికారులతో మరో మంత్రి సమీక్ష జరపడం ఏమిటని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలిసింది. ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రి తన నియోజవర్గంలోని అటవీ భూముల మీదుగా వెళుతున్న రహదారులకు అటవీ క్లియరెన్స్, పోడు భూముల సమస్యలపై అటవీశాఖ అధికారులతో కొన్నిరోజుల క్రితం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. పీసీసీఎఫ్ సువర్ణ, ఆ సమీక్ష నిర్వహించిన మంత్రికి చెందిన జిల్లా కలెక్టర్, అటవీ శాఖ అధికారులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఈ విషయం మంత్రి కొండా సురేఖకు తెలియడంతో ఆమె అసహనానికి గురయ్యారు. అటవీ శాఖ హెచ్‌ఓడీగా ఉన్న పీసీసీఎఫ్‌ను నేరుగా పిలవడమంటే మొత్తం శాఖకు సంబంధించిన ఉన్నతాధికారినే పిలిచినట్టు అవుతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. జిల్లా, నియోజకవర్గానికి సంబంధించిన అంశాలైతే అక్కడి అధికారుల వరకే సమావేశానికి పిలవాల్సిందని పేర్కొన్నట్టు సమాచారం. దీనిపై ఆమె సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మరోవైపు సదరు మంత్రి మాత్రం తన నియోజకవర్గానికి సంబంధించిన అటవీ అంశాలు కావడంతోనే ఆ అధికారులతో మాట్లాడానని అంటున్నట్టు సమాచారం. ఇంతకుముందు మంత్రి కొండా సురేఖ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారుల తీరునూ తప్పుబట్టారు. కాలుష్య నియంత్రణ బోర్డుకు సంబంధించిన సమీక్షకు హాజరుపై, సరిగా వివరాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అటవీ శాఖ ఉన్నతాధికారుల తీరుపైనా ఆమె మండిపడటం చర్చనీయాంశంగా మారింది.