CMR rice scam: రూ. 5.9 కోట్ల సీఎంఆర్ పక్కదారి!
ABN , Publish Date - Sep 11 , 2025 | 04:21 AM
పౌరసరఫరాల సంస్థకు వికారాబాద్ జిల్లా తాండూరులోని మిల్లు లీజు హోల్డర్లు బురిడి కొట్టించారు. సీఎంఆర్...
పౌర సరఫరాల సంస్థకు రైస్‌మిల్లు లీజు హోల్డర్ల బురిడీ
తాండూరులో ఘటన.. ఇద్దరి అరెస్టు, రిమాండ్
తాండూరు, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): పౌరసరఫరాల సంస్థకు వికారాబాద్ జిల్లా తాండూరులోని మిల్లు లీజు హోల్డర్లు బురిడి కొట్టించారు. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు పంపించాల్సి ఉండగా వాటిని పక్కదారి పట్టించడంతో కటకటాల పాలయ్యారు. యలాల మండలం చెన్నారం సమీపంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్‌కు కృష్ణసాయి రైస్ ఇండస్ట్రీస్ ఉంది. ఈ మిల్లును 2022లో సంగెం కుర్దుకు చెందిన సంతోశ్ కుమార్, అక్కంపల్లికి చెందిన చల్లా వెంకటేశ్‌కు లీజ్‌కు ఇచ్చారు. వారు రూ.5.9 కోట్ల విలువ చేసే బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థకు సరఫరా చేయకుండా కర్ణాటకకు, ఇతర మిల్లర్లకు విక్రయించి డబ్బులను సొంతానికి వాడుకున్నారు. సీఎంఆర్ రైస్‌ను పంపడం లేదని రైస్‌మిల్ యజమాని రవిగౌడ్‌కు సివిల్ సప్లయి శాఖ జూలై 26న నోటీసులు పంపింది. దీంతో రవిగౌడ్ లీజు హోల్డర్లను నిలదీయగా చెల్లని చెక్కులను అందించారు. దీంతో అధికారులు జరిమానాతో నోటీసు పంపారు. ప్రభుత్వానికి రూ.5.9 కోట్లు చెల్లించాల్సి ఉందని లీజుదారులపై రవిగౌడ్ గతనెల 26న ఫిర్యాదు చేయగా యాలాల పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.