Minister Ponguleti Srinivasa Reddy: శిక్షణ పూర్తయిన సర్వేయర్లకు లైసెన్సులు
ABN , Publish Date - Oct 18 , 2025 | 05:05 AM
రెవెన్యూ శాఖకు, సర్వే విభాగానికి అవినాభావ సంబంధం ఉందని, సర్వే వ్యవస్థ బలంగా ఉంటేనే ప్రజలకు భద్రత, న్యాయం లభిస్తాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి...
ముఖ్యమంత్రి చేతుల మీదుగా రేపు అందజేత
శిక్షణలో 3,465 మంది అర్హులు: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, అక్టోబరు17(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖకు, సర్వే విభాగానికి అవినాభావ సంబంధం ఉందని, సర్వే వ్యవస్థ బలంగా ఉంటేనే ప్రజలకు భద్రత, న్యాయం లభిస్తాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. రెవెన్యూ శాఖ అధికారులతో సచివాలయంలో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి మండలానికి లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న సర్వేయర్లకు హైదరాబాద్‌లోని శిల్పాకళావేదికలో ఆదివారం(19వ తేదీ) జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అనుమతి పత్రాల అందజేస్తారని వెల్లడించారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా పది వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. అందులో తొలి విడతలో 7,000 మందికి శిక్షణ ఇవ్వగా వారిలో 3,465 మంది అర్హత సాధించారని మంత్రి పేర్కొన్నారు. రెండో విడతలో మరో 3,000 మందికి ఆగస్టు 18 నుంచి శిక్షణ ప్రారంభించామని అక్టోబరు 26న వారికి పరీక్ష ఉంటుందని తెలిపారు.