Share News

CM Revanth Reddy: అలసత్వం.. ఇంకానా!?

ABN , Publish Date - Oct 19 , 2025 | 03:50 AM

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు...

CM Revanth Reddy: అలసత్వం.. ఇంకానా!?

  • ప్రభుత్వం వచ్చి రెండేళ్లైనా కొందరి పనితీరులో మార్పు లేదు.. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమల్లో నిర్లక్ష్యం వద్దు.. సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దు

  • ఏ దశలోనూ ఫైళ్లు, పనులు ఆగిపోవడానికి వీల్లేదు.. కేంద్ర గ్రాంట్లపై ప్రత్యేకంగా దృషి పెట్టాలి

  • ప్రతి వారం నివేదికలివ్వండి.. సీఎస్‌, ముఖ్య కార్యదర్శులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

  • కొంతమంది అధికారుల పనితీరు బాగాలేదంటూ అసంతృప్తి

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో అధికారుల అలసత్వాన్ని సహించేది లేదన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా.. కొంతమంది అధికారుల పనితీరులో మార్పు లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అలసత్వాన్ని వీడాలని తేల్చి చెప్పారు. ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని, అన్ని విభాగాల సమన్వయంతో ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు ముందుగా ప్రాధాన్యమివ్వాలని సూచించారు. సీఎంవో కార్యదర్శులు, సీఎస్‌ రామకృష్ణారావుతో శనివారం ఉదయం తన నివాసంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విషయంలో అధికారులు మరింత చురుగ్గా పని చేయాలని చెప్పారు. అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని, పనుల పురోగతిని సమీక్షించాలని సీఎ్‌సను ఆదేశించారు. ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఎక్కడా కూడా ఫైళ్లు, పనులు ఆగిపోవడానికి వీల్లేదని హెచ్చరించారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ఏయే పథకాల్లో రాష్ట్ర వాటాను చెల్లిస్తే.. కేంద్రం నుంచి నిధులు వస్తాయో.. వాటికి ముందుగా ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఇకపై సీఎ్‌సతోపాటు సీఎంవో అధికారులు తమ పరిధిలోని విభాగాలపై ప్రతి వారం తనకు నివేదికలు అందించాలని, తానే స్వయంగా వాటిపై సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు.

Updated Date - Oct 19 , 2025 | 03:50 AM