Share News

CM Revanth vows to complete SLBC tunnel: ఇప్పుడు కాకపోతే..ఎస్‌ఎల్‌బీసీ ఎప్పటికీ పూర్తి కాదు

ABN , Publish Date - Nov 04 , 2025 | 02:39 AM

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం నిర్మాణం ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పటికీ పూర్తి కాదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు....

CM Revanth vows to complete SLBC tunnel: ఇప్పుడు కాకపోతే..ఎస్‌ఎల్‌బీసీ ఎప్పటికీ పూర్తి కాదు

  • రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్‌ టన్నెల్‌ పనులను పదేళ్లు పడావు పెట్టారు

  • కాంగ్రె్‌సకు పేరొస్తుందని, కమీషన్లు రావని కేసీఆర్‌, హరీశ్‌రావు కుట్ర చేశారు

  • అధునాతన సాంకేతికతతో రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పూర్తి చేస్తాం

  • ప్రాజెక్టు పూర్తయితే పైసా ఖర్చు లేకుండా 3 లక్షల ఎకరాలకు నీరు: సీఎం రేవంత్‌

  • ఎస్‌ఎల్‌బీసీ వద్ద ‘హెలీబార్న్‌ ఎలకో్ట్రమ్యాగ్నటిక్‌ సర్వే’ ప్రారంభం

మహబూబ్‌నగర్‌/నాగర్‌కర్నూల్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం నిర్మాణం ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పటికీ పూర్తి కాదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు ప్రాంత బిడ్డలుగా ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. సోమవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లిలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఔట్‌లెట్‌ వద్ద ‘హెలీబార్న్‌ ఎలకో్ట్ర మ్యాగ్నటిక్‌ జియో ఫిజికల్‌ సర్వే’ను ప్రారంభించారు. ప్రత్యేక పరికరాలను అమర్చిన హెలికాప్టర్‌ ముందు వెళుతూ సర్వే చేయగా, సీఎం మంత్రుల బృందం మరో హెలికాప్టర్‌లో వెనకాల వెళ్లి పరిశీలించింది. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ కోసం పోరాడింది నీళ్ల కోసమే. కానీ ఆ ఉద్దేశాన్ని కేసీఆర్‌ దెబ్బతీశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు 2014 నాటికే 30 కిలోమీటర్లకు పైగా సొరంగం తవ్వకాన్ని పూర్తి చేస్తే.. తర్వాత కేవలం 2 కిలోమీటర్లే తవ్వారు. కాంగ్రె్‌సకు పేరొస్తుందని, కమిషన్లు రావనే దురుద్దేశంతో కేసీఆర్‌, హరీశ్‌రావు పదేళ్లపాటు ఎస్‌ఎల్‌బీసీని పడావు పెట్టారు. అది పూర్తయి ఉంటే పైసా ఖర్చు లేకుండా 3 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మంది ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించే అవకాశం ఉండేది. ఎస్‌ఎల్‌బీసీకి బదులు ఏఎమ్మార్పీ ఎత్తిపోతలపై ఆధారపడటం వల్ల ఏటా రూ.500 కోట్ల చొప్పున పదేళ్లలో రూ.5వేల కోట్లు విద్యుత్‌ బిల్లుల భారం పడింది’’ అని రేవంత్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పడావు పెట్టిన ఈ ప్రాజెక్టును కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రారంభించామని, దురదృష్టవశాత్తు టన్నెల్‌ కూలి కొందరు కార్మికులు చనిపోయారని పేర్కొన్నారు. ఎంతో ప్రయోజనకరమైన ఈ ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయాలనే సంకల్పంతో ‘ఎలకో్ట్ర మ్యాగ్నటిక్‌ సర్వే’ను ప్రారంభించామని చెప్పారు. కేంద్రంతో మాట్లాడి సొరంగాల విషయంలో సుదీర్ఘ అనుభవం కలిగిన జనరల్‌ హర్పాల్‌సింగ్‌, కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రాను డిప్యూట్‌ చేసుకున్నామని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే రెండేళ్లలో టన్నెల్‌ను పూర్తి చేస్తామని రేవంత్‌ తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీని పడావు పెడితే.. మరోవైపు ఏపీ పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచుకుని, భారీగా నీటిని తరలించుకుటోందని గుర్తు చేశారు. ఎస్‌ఎల్‌బీసీ పూర్తయితే శ్రీశైలం ప్రాజెక్టు నిండినప్పుడల్లా కావాల్సినన్ని నీటిని తరలించుకోవచ్చని చెప్పారు.


గత సర్కారు తీరుతో తీవ్ర నష్టం

కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌ సాగర్‌తోపాటు పాలమూరు- రంగారెడ్డి సహా కృష్ణానదిపై చేపట్టిన ఏ ప్రాజెక్టును కూడా కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తి చేయలేదని రేవంత్‌ మండిపడ్డారు. కృష్ణానదిలో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల్లో తెలంగాణ వాటా 299 టీఎంసీలేనని ఏపీ వాదిస్తోందని... గత ప్రభుత్వం మతిలేక చేసిన సంతకమే దానికి కారణమని విమర్శించారు. గత ప్రభుత్వం అన్నీ తప్పులు చేసి, అప్పులు చేసి దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. కాంగ్రె్‌సపై విమర్శలు చేస్తున్న హరీశ్‌రావు చిల్లర మాటలు ఆపేస్తే మంచిదని వ్యాఖ్యానించారు.

ఈ తరహా సర్వే దేశంలోనే ప్రథమం: ఉత్తమ్‌

తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి ఉత్తమ్‌ చెప్పారు. అత్యాధునికమైన హెలిబార్న్‌ ఎలకో్ట్ర మ్యాగ్నటిక్‌ సాంకేతికతతో.. టన్నెల్‌ నిర్మాణం తలపెట్టిన 44 కిలోమీటర్ల పొడవునా ద్వారా సర్వే చేయనున్నట్టు తెలిపారు. దేశంలో హెలీబార్న్‌ ఎలకో్ట్ర మ్యాగ్నెటిక్‌ సర్వే నిర్వహించడం ఇక్కడే ప్రథమమని చెప్పారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కావాలనే ఎస్‌ఎల్‌బీసీ పనులను పక్కనపెట్టారని ఆరోపించారు. కాగా, నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్‌ నుంచి కాపాడటానికి ఎస్‌ఎల్‌బీసీ ఎంతో కీలకమని, ఎంత ఖర్చయినా సరే ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సీఎం రేవంత్‌ సిద్ధమయ్యారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. వికారాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే మూసీ నదిని కూడా పరిశుభ్రం చేస్తామని, ఖర్చుకు వెనకాడకుండా తమ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. ఈ విషయంలో జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.

ఏమిటీ ‘హెలీబార్న్‌ఎలకో్ట్ర మ్యాగ్నటిక్‌ సర్వే’?

ఎలాంటి తవ్వకాల అవసరం లేకుండానే విద్యుదయస్కాంత తరంగాల సాయంతో భూమిలో కొంత లోతు వరకు రాళ్లు, మట్టి, నీళ్లు, ఇతర అంశాల పరిస్థితి ఎలా ఉందో గుర్తించడానికి హెలికాప్టర్‌ సాయంతో చేపట్టే ప్రక్రియనే ‘హెలిబార్న్‌ ఎలకో్ట్ర మ్యాగ్నటిక్‌ జియో ఫిజికల్‌ సర్వే’ అంటారు. హెలికాప్టర్‌కు బిగించిన పరికరాల్లోని ట్రాన్స్‌మిటర్‌ విద్యుదయస్కాంత తరంగాలను భూమివైపు విడుదల చేస్తుంది. ఆ తరంగాలు భూమి పొరలోకి చొచ్చుకెళ్లినప్పుడు.. ప్రతిస్పందనగా మట్టి, రాళ్లు, నీళ్లు, ఇతర అంశాల్లో విద్యుదయస్కాంత తరంగాలు ఉత్పత్తి అవుతాయి.వాటిని హెలికాప్టర్‌లోని రిసీవర్‌ గ్రహించి, విశ్లేషిస్తుంది. ఇప్పుడు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పొడవునా ఈ సర్వే చేసి.. మట్టి, రాళ్లు, నీళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయనేది గుర్తిస్తారు. అందుకు అనుగుణంగా టన్నెల్‌ పనులు కొనసాగిస్తారు.

Updated Date - Nov 04 , 2025 | 02:39 AM