Share News

CM Revanth Urges: జూబ్లీహిల్స్‌.. మనదే!

ABN , Publish Date - Sep 15 , 2025 | 05:24 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సంబంధించి తాజా సర్వేలన్నీ కాంగ్రెస్‌ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అయినా ఆషామాషీగా తీసుకోవద్దని..

CM Revanth Urges: జూబ్లీహిల్స్‌.. మనదే!

  • కాంగ్రెస్‌కే అనుకూలమని సర్వేలన్నీ చెబుతున్నాయ్‌

  • అయినా ఉప ఎన్నికను తేలిగ్గా తీసుకోవద్దు.. ఇక్కడ గెలుపుతో గ్రేటర్‌లోనూ బలపడతాం

  • భవిష్యత్తుకూ ప్రోత్సాహకంగా ఉంటుంది.. సానుభూతినే నమ్ముకున్న బీఆర్‌ఎస్‌

  • నగర అభివృద్ధికి ఆ పార్టీ చేసిందేమీ లేదు.. హైదరాబాద్‌ అభివృద్ధిలో బీజేపీ పాత్రే లేదు

  • పార్టీ కేంద్రీకృతంగా ప్రచారం చేయండి.. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

  • జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై డివిజన్‌ ఇన్‌చార్జుల సమావేశంలో సీఎం రేవంత్‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సంబంధించి తాజా సర్వేలన్నీ కాంగ్రెస్‌ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అయినా ఆషామాషీగా తీసుకోవద్దని, గెలుపే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పని చేయాలని ఆ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్‌ పార్టీ డివిజన్‌ ఇన్‌చార్జులకు సూచించారు. జూబ్లీహిల్స్‌లో గెలుపుతో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనూ కాంగ్రెస్‌ పార్టీ బలపడుతుందన్నారు. భవిష్యత్తు పాలనకు ఇది ప్రోత్సాహకంగా ఉంటుందని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీకి మరింత ఉత్సాహాన్నిస్తుందని అన్నారు. హైదరాబాద్‌ శివారు జిల్లాలపైనా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలోని డివిజన్లకు వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లను ఇన్‌చార్జులుగా కాంగ్రెస్‌ నియమించిన సంగతి తెలిసిందే. ఆదివారం వారితో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ సమావేశమయ్యారు. తొలుత డివిజన్‌ ఇన్‌చార్జుల నుంచి ముఖ్యమంత్రి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నారు. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలను ప్రాథమ్యాల వారీగా వివరించారు. సానుకూల దృక్పథంతో ముందుకెళ్లాలని, పోలింగ్‌ బూత్‌ల వారీగా ప్రచార ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా, కాంగ్రెస్‌ పార్టీతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమన్న నమ్మకాన్ని కల్పించాలన్నారు. ఈ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సానుభూతినే నమ్ముకుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్ల పాలనలో హైదరాబాద్‌ అభివృద్ధికి ఆ పార్టీ చేసిందేమీ లేదన్నారు. ఇక హైదరాబాద్‌ అభివృద్ధిలో బీజేపీకి ఎటువంటి పాత్ర లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇన్‌చార్జులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వ్యక్తి కేంద్రీకృతంగా కాకుండా.. పార్టీ కేంద్రీకృతంగానే ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రచారంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌పై, ఆయన కుటుంబంపై విమర్శలు చేయవద్దని, కేసీఆర్‌, కేటీఆర్‌లనే లక్ష్యంగా చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికను ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికగా తీసుకోవాలని, పార్టీని గెలిపించాల్సిన గురుతర బాధ్యత ఇన్‌చార్జులపై ఉందన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై తాను ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటానని చెప్పారు. అభ్యర్థి ఎంపిక అధిష్ఠానం పరిధిలో ఉందని సీఎం తెలిపారు. ప్రత్యేక బృందాలు.. అభిప్రాయ సేకరణ చేస్తున్నాయన్నారు.

Updated Date - Sep 15 , 2025 | 05:24 AM