CM Revanth Reddy: నీటి పారుదల ప్రాజెక్టులపై రేపు సీఎం రేవంత్ సమీక్ష
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:42 AM
రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం(28న) అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు...
బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేటాయింపులు, చేసిన ఖర్చులు, అప్పులపై ఆరా.. అధిక వడ్డీకి తెచ్చిన అప్పులపై చర్చ
అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో నిర్ణయం
హైదరాబాద్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం(28న) అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 2014 నుంచి 2023 దాకా నీటి ప్రాజెక్టులపై గత ప్రభుత్వం అనుసరించిన విధానం, కేటాయింపులు, వెచ్చించిన నిధులు, జరిగిన నష్టంపై ఈ సమీక్షలో చర్చించనున్నారు. భారీ వడ్డీతో తీసుకున్న రుణాలు, ఈ రెండేళ్ల కాలంలో ఆ రుణభారం తీర్చడానికి ఏ మేరకు చెల్లింపులు చేయాల్సి వచ్చిందన్న దానిపైనా సమీక్షించనున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో రెండేళ్లుగా ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులు, పనులపై కూడా చర్చించనున్నారు. ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డితో పాటు కృష్ణా బేసిన్‌లోని వివిధ ప్రాజెక్టుల పనులను ఏ విధంగా చేపట్టారు? రీడిజైనింగ్ వల్ల పనుల్లో జరిగిన జాప్యం, ఏ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎంత కాలం పాటు ఆలస్యమయ్యాయి? తదితర వివరాలపై సీఎం రేవంత్ అధికారులను ఆరా తీయనున్నారు. 29నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, జనవరి 1న మహాత్మాజ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నీటిపారుదలశాఖపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. 2014-23 మధ్యకాలంలో జరిగిన పరిణామాలను వివరించనున్నారు. దీనికి సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.