Share News

CM Revanth Seeks Central Support: తెలంగాణకు అండగా నిలవండి

ABN , Publish Date - Dec 04 , 2025 | 05:27 AM

గుజరాత్‌ అభివృద్ధికి కీలక సహకారం అందించినట్లే.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కూడా పూర్తి అండదండలు అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి..

CM Revanth Seeks Central Support: తెలంగాణకు అండగా నిలవండి

  • మీరు సహకరిస్తే గుజరాత్‌ నమూనాలా తెలంగాణ నమూనా సృష్టిస్తా

  • మన్మోహన్‌సింగ్‌ మీకు సహకరించినట్లే.. మీరూ నాకు సహకరించండి

  • తె లంగాణ రైజింగ్‌ గ్లోబల్‌సమ్మిట్‌కు హాజరు కండి

  • ప్రధాని మోదీని కోరిన సీఎంరేవంత్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): గుజరాత్‌ అభివృద్ధికి కీలక సహకారం అందించినట్లే.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కూడా పూర్తి అండదండలు అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ప్రధాని సంకల్పించిన వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యాలకు అనుగుణంగా 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దాలని సంకల్పించామని చెప్పారు. ఈ లక్ష్యాలు సాధించాలంటే కేంద్రం మద్దతు అవసరమన్నారు. బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో కలిసి రేవంత్‌రెడ్డి పార్లమెంట్‌లో ప్రధానమంత్రిని కలుసుకున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌లోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్‌ 2047 గ్లోబల్‌ సమ్మిట్‌కు రావాలని ప్రధానిని ఆహ్వానించారు. ఈ మేరకు ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబ ల్‌ సమ్మిట్‌ ఆహ్వాన పత్రికను ప్రధానికి అందజేశారు. వికసిత్‌ భారత్‌కు అనుగుణంగా అన్నిరంగాల్లో వృద్ధి లక్ష్యాలను సాధించేందుకు వీలుగా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించామని, వీటిని 2047 విజన్‌ డాక్యుమెంట్‌లో చేర్చామని తెలిపారు. తెలంగాణ రైజింగ్‌ విజన్‌లో భాగంగా చేపట్టే అభివృద్ధి పనులు సాకారం కావాలంటే కేంద్రం తగిన సహా య సహకారాలు అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పలు ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ‘‘మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్‌ మోడల్‌కు మీకు సహకరించారు కదా! అలాగే మీరు కూడా నాకు సహకరించాలి’’ అని మోదీని కోరినట్లు మీడియాతో రేవంత్‌ అన్నారు. ఇందుకు మోదీ కూడా అంగీకరించారని చెప్పారు. ‘మీరు ఆశీస్సులందిస్తే తప్పకుండా గుజరాత్‌ నమూనా ప్రాతిపదికగా తెలంగాణ నమూనాను సృష్టిస్తా అని చెప్పినప్పుడు మోదీ నవ్వుతూ అంగీకరించారు’ అని రేవంత్‌ వెల్లడించారు.

పనులకు అనుమతులు ఇవ్వండి..

హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు తగిన అనుమతులు ఇవ్వాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్‌ కోరారు. 1,625 కిలోమీటర్ల పొడవున విస్తరించే ప్రతిపాదనలను ఇప్పటికే సమర్పించామని చెప్పారు. రూ.49,848 కోట్ల అంచనా వ్యయం తో రూపొందించిన ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్‌ వెంచర్‌గా చేపట్టేందుకు ఆమోదం తెలపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్‌ ఉత్తర భాగానికి క్యాబినెట్‌ ఆమోదంతోపాటు ఆర్థిక మంజూరీ చేయాలని, దక్షిణ భాగం నిర్మాణ పనులకు అనుమతులు ఇవ్వాలని కూడా కోరారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు సమాంతరంగా రీజినల్‌ రైల్వే ప్రాజెక్టును త్వరితగతిన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే, హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు హైస్పీడ్‌ కారిడార్‌ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణాలు చేపట్టేందుకు కేంద్రం ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరం రవాణా సదుపాయాలు కల్పించేందుకు టైగర్‌ రిజర్వ్‌ మీదుగా మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఫోర్‌ లేన్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణ ప్రతిపాదనల్ని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర మంత్రులకూ ఆహ్వానం..

భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలువురు కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఐటీ, రైల్వే శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్‌, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహల్‌లాల్‌ ఖట్టర్‌లను రేవంత్‌ కలుసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ఎంపీలు మల్లు రవి, రఘువీర్‌ రెడ్డి, సురేష్‌ షెట్కార్‌, చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ, అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఉన్నారు. కాగా కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయెల్‌ను భట్టి విక్రమార్క వేరుగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

సోనియా, రాహుల్‌, ప్రియాంకకు ఆహ్వానం

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరు కావాలంటూ కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీని సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. పార్లమెంట్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మరోసారి కలుసుకుని పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై చర్చించారు.

Updated Date - Dec 04 , 2025 | 05:36 AM