CM Revanth Reddy: సీఎం సొంత మండల రైతులందరికీ సోలార్ పంపుసెట్లు
ABN , Publish Date - Oct 12 , 2025 | 03:21 AM
సీఎం రేవంత్‌రెడ్డి సొంత మండలం వంగూరులోని రైతులందరికీ పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ పంపుసెట్లను పెట్టడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది...
7,500 బోరుబావులకు ఏర్పాటు
జీవో జారీ చేసిన ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి
హైదరాబాద్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : సీఎం రేవంత్‌రెడ్డి సొంత మండలం వంగూరులోని రైతులందరికీ పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ పంపుసెట్లను పెట్టడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మండలంలో 7,500 బోరుబావులకు సోలార్ పంపుసెట్లను ప్రయోగాత్మకంగా పెట్టనున్నారు. ఇందుకు రూ.258 కోట్లు ఖర్చవుతుంది. ఈ పంపులను పీఎం కుసుమ్ పథకం కింద పెట్టినా వీటికి అయ్యే పూర్తి వ్యయం దక్షిణ డిస్కమ్(ఎస్పీడీసీఎల్) భరించనుంది. ఇందుకు నిధులను రుణం రూపంలో సమీకరించుకొని.. వ్యవసాయ పంపుసెట్లకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో రుణం కట్టుకోవాలని నిర్దేశించింది. ప్రభుత్వంపై ఎటువంటి అదనపు భారం వేయరాదని నిర్దేశించింది. ఈమేరకు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ శనివారం జీవో జారీ చేశారు. ఇక సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు మండలంలోనే ఉంది. ఇప్పటికే కొండారెడ్డిపల్లిలో ప్రతీ ఇంటికి సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లు పెట్టారు. దాంతో దేశంలోని సౌర విద్యుత్ ఆధారిత గ్రామాల్లో ఒకటిగా కొండారెడ్డిపల్లి గుర్తింపు పొందినవిషయం విదితమే.