CM Revanth Reddy: అడిగిన అనుమతులు ఇవ్వనందుకు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?
ABN , Publish Date - Nov 08 , 2025 | 02:32 AM
డబ్బుల కోసం పిల్లల చదువులతో చెలగాట మాడితే కఠినంగా వ్యవహరిస్తామంటూ ప్రయివేటు కశాళాలల యాజమాన్యాలను సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు...
అరోరా రమేష్ 12 కాలేజీలకు అనుమతి అడిగిండు
జయ్‌ప్రకాష్.. మహబూబ్‌నగర్‌లో కాలేజీకి హైదరాబాద్‌లో ఆఫ్ క్యాంపస్ ఇవ్వమన్నడు
నిబంధనలకు వ్యతిరేకమని ఇవ్వలేదు
ఇక డొనేషన్లు ఎలా వసూలు చేస్తారో చూస్త: సీఎం రేవంత్
హైదరాబాద్, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): డబ్బుల కోసం పిల్లల చదువులతో చెలగాట మాడితే కఠినంగా వ్యవహరిస్తామంటూ ప్రయివేటు కశాళాలల యాజమాన్యాలను సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అడిగిన అనుమతులు ఇవ్వనందుకు ప్రభుత్వాన్నే బ్లాక్‌మెయిల్ చేస్తారా?అంటూ నిలదీశారు. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు చెల్లించాలంటూ కాలేజీ యాజమాన్యాలు చేపట్టిన బంద్‌పైఆయన స్పందించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి గత ప్రభుత్వం పెట్టిన సమస్య అని చెప్పారు. 2014 నుంచి ఇప్పటి దాకా ఈ పథకం కింద చదువుకున్న విద్యార్థులు ఎవరు? ఎవరెవరికి బకాయి ఉందన్న దానిపైన సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ చేద్దామని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పైన 2014-15 సంవత్సరంలో కేసీఆర్ ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ చేసి నివేదిక ఇచ్చిందని, ఆ నివేదికపైనా చర్యలు తీసుకుందామని ప్రతిపాదించారు. కాలేజీల యాజమాన్యాలు వ్యాపారం చేస్తున్నారే కానీ సేవ చేయట్లేదని చెప్పారు. వారు రాజకీయ ప్రేరేపిత ప్రకటనలు చేస్తేనో అధికారులను తిడితేనో ఫీజు రీయింబర్స్‌మెంట్ రాదని అన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో పదవీ విరమణ ప్రయోజనాలను కూడడా విడతల వారీగా ఇస్తున్నామని గుర్తు చేశారు. కాలేజీలను బంద్ పెడితే విద్యార్థులకు చదువు దూరమవుతుందని, వారి జీవితాలతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు. విడతల వారీగా ఫీజులు చెల్లించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. మొదట తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడ్డ బకాయిలు ఇస్తామని తెలిపారు. కేసీఆర్ పెట్టిన బకాయిలు అడగొద్దని స్పష్టం చేశారు. ‘‘మీరు కాలేజీలు బంద్ పెడితే పిల్లలను కాలేజీల వైపుకు తిప్పడం మాకూ తెలుసు.
వారిని వెనక్కు తిప్పితే ఏమైతదో తెలుసు. ప్రభుత్వం నడుపుతున్నాము కాబట్టి ఆ ప్రయత్నం చేయట్లేదు’’ అన్నారు. పిల్లల చదువులకు ఆటంకం కలిగితే కాలేజీ యాజమాన్యాలపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాలేజీల పరిశీలనకే రానివ్వబోమంటే యాజమాన్యాలు ఏ రకమైన వ్యవహార శైలితో ఉన్నట్లని అడిగారు. బంద్ పెడతామంటే ఇంక చర్చించడానికి ఏముంటుందని అన్నారు. ఎవరెవరు క్యాంప్‌సలు అడిగారో తన దగ్గర జాబితా ఉందని, అవి ఇవ్వనందుకు ప్రభుత్వాన్నే బ్లాక్ మెయిల్ చేస్తారా అని ప్రశ్నించారు. ప్రతినెలా ప్రభుత్వానికి వస్తున్న రూ. 18,500 కోట్ల ఆదాయంలో వేతనాలు, అప్పులకు.. వాయిదాలు పోను రూ.5,500 కోట్లు మాత్రమే మిగులుతున్నాయని, ఇందులోనే రిటైర్‌మెంట్ బెనిఫిట్లు, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, కళ్యాణలక్ష్మి వగైరా సంక్షేమ పథకాలూ అమలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించడానికి ఏ సంక్షేమ పథకం ఆపాలో కాలేజీ యాజమాన్యాలే చెప్పాలన్నారు. ‘‘కాలేజీ యాజమాన్యాలు వచ్చే ఏడాది ఎట్ల డొనేషన్లు వసూలు చేస్తయో నేనూ చూస్త. ప్రభుత్వం చట్టాన్ని పకడ్బందీగా చేస్తుంది. విద్య.. వ్యాపారం కాదు.. సేవ! వ్యాపార తెలివితేటలు ఇందులో పెడతామంటే కుదరదు. వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయని ఏది పడితే అది మాట్లాడతారా? అడిగిన అనుమతులు ఇవ్వకుంటే ప్రభుత్వాన్నే బ్లాక్ మెయిల్ చేస్తారా?’’ అంటూ నిలదీశారు. అరోరా విద్యాసంస్థల యాజమాని రమేష్ 12 కాలేజీలకు అనుమతులు అడిగాడని, మహబూబ్‌నగర్‌లో ఉన్న కాలేజీకి హైదరాబాద్‌లో ఆఫ్ క్యాంపస్ కోసం జయప్రకాష్ అనుమతి కోరాడని వెల్లడించారు. నిబంధనలకు వ్యతిరేకం కావడంతో అనుమతులు ఇవ్వలేదన్నారు. దీని వెనుక ఉన్న బీజేపీ నేతలు ఏమేమి అడిగారో కూడా తనకు తెలుసునన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అమాయకంగా వీరి ఉచ్చులో పడుతున్నాడన్నారు. ఆర్.కృష్ణయ్య, మంద కృష్ణలకు రాబోయే మూడు నెలలు ఫైనాన్స్‌ను అప్పజెపుతానని, వచ్చే 18,500 కోట్లతో ప్రభుత్వం ఎట్ల నడపాలో వారే చెప్పాలని అడిగారు.