Share News

CM Revanth Reddy: నేడు దేవరకొండకు సీఎం రేవంత్‌

ABN , Publish Date - Dec 06 , 2025 | 06:09 AM

తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నల్లగొండ జిల్లా దేవరకొండలో శనివారం పర్యటించనున్నారు....

CM Revanth Reddy: నేడు దేవరకొండకు సీఎం రేవంత్‌

  • పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

  • ప్రజాపాలన విజయోత్సవ సభలో ప్రసంగం

  • పాల్గొననున్న మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌

నల్లగొండ/హైదరాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నల్లగొండ జిల్లా దేవరకొండలో శనివారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం చేపట్టే అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, బహిరంగ సభ ఏర్పాట్లను నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్రపవార్‌, స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్‌ శుక్రవారం పరిశీలించారు. సీఎం పర్యటనలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీలో భాగంగా రూ.11.33 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేయనున్నారు. దేవరకొండలోని బీఎన్‌ఆర్‌ కాలనీలో రూ.2 కోట్లతో పార్కు నిర్మాణం, ప్రభుత్వ బాలుర కాలేజీలో రూ.2 కోట్లతో స్టేడియం, వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణం, రూ.2.50 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సాయంత్రం పట్టణ శివారులోని శేరిపల్లి వద్ద ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తదితరులు ఈ సభకు హాజరుకానున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

‘సాయుధ దళాల నిధి’కి రూ.లక్ష విరాళం..

సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం రేవంత్‌ రూ.లక్ష విరాళంగా అందించారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సీఎంను సైనిక్‌ వెల్ఫేర్‌ ప్రతినిధులు ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారికి విరాళాన్ని సీఎం అందించారు. అలాగే బోల్డ్‌ అండ్‌ బ్రేవ్‌ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

Updated Date - Dec 06 , 2025 | 06:09 AM