Share News

CM Revanth Reddy: అభివృద్ధిని గెలిపించాలి..

ABN , Publish Date - Nov 01 , 2025 | 04:59 AM

ఎన్నికల్లో చూడాల్సింది సెంటిమెంట్‌ను కాదని, అభివృద్ధిని గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ ఓటర్లకు పిలుపునిచ్చారు.

CM Revanth Reddy: అభివృద్ధిని గెలిపించాలి..

  • కంటోన్మెంట్‌లో 4 వేల కోట్లతో పనులు చేపట్టాం

  • జూబ్లీహిల్స్‌లో గెలిపిస్తే అదే తరహాలో అభివృద్ధి చేస్తాం

  • పీజేఆర్‌ మరణిస్తే ఆ కుటుంబంపై పోటీ పెట్టారు

  • దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్‌ఎస్సే

  • వారి మోసంతో ఇల్లిల్లు తిరుగుతున్న సొంత చెల్లెలు

  • కార్పెట్‌ బాంబింగ్‌ చేయడానికి బీజేపీ జాగీరా?

  • అమీర్‌పేటలో ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టే బాధ్యత నాది

  • అజార్‌ ఓడినా.. మాట ప్రకారం మంత్రిని చేశా

  • జూబ్లీహిల్స్‌లో రోడ్డు షోలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ/ యూసుఫ్‌గూడ/ బంజారాహిల్స్‌/ పంజాగుట్ట, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో చూడాల్సింది సెంటిమెంట్‌ను కాదని, అభివృద్ధిని గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ ఓటర్లకు పిలుపునిచ్చారు. మాగంటి గోపీనాథ్‌ కుటుంబంపై తనకు సానుభూతి ఉందని, అయితే మూడుసార్లు గెలిస్తే జరగని అభివృద్ధి.. నాలుగోసారి గెలిస్తే జరుగుతుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం రాత్రి రోడ్డు షో నిర్వహించారు. వెంగళ్‌రావునగర్‌, సోమాజిగూడ జవహర్‌నగర్‌ కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ వాళ్లు సెంటిమెంట్‌ను చూపించి గెలిపించాలంటున్నారని, కానీ.. 2007లో పీజేఆర్‌ మరణించినప్పుడు ఆయన కుటుంబంలోని వ్యక్తిని ఏకగ్రీవం చేద్దామంటే జాన్తానై అంటూ అభ్యర్థిని నిలబెట్టలేదా? అని ప్రశ్నించారు. నాడు చంద్రబాబునాయుడు, బీజేపీ కూడా పీజేఆర్‌పై ఉన్న గౌరవంతో రాజకీయ వైరుధ్యాన్ని పక్కన పెట్టారని, పీజేఆర్‌ కుటుంబానికి అండగా నిలిచి.. మరణించిన కుటుంబంలో ఏకగ్రీవానికి ప్రయత్నించారని తెలిపారు. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఈ మంచి సంప్రదాయాన్ని తుంగలో తొక్కి.. దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కాదా? అని నిలదీశారు. పీజేఆర్‌ కుటుంబానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టిన బీఆర్‌ఎస్‌.. నేడు సానుభూతి ఓట్లను అడుగుతోందని మండిపడ్డారు.


కంటోన్మెంట్‌లో రూ.4వేల కోట్లతో పనులు..

‘‘ఆనాటి సీఎం, మునిసిపల్‌ శాఖ మంత్రి మీ బస్తీలకు వచ్చారా? మీ సమస్యలను పరిష్కరించారా? పదేళ్లలో ఏనాడైనా సినీ కార్మికులను కలిశారా? పలకరించారా? కనీసం వాళ్ల ఆరోగ్యం దెబ్బతింటే దవాఖానాల్లో మందు వేయాలనే ఆలోచన చేశారా?’’ అని సీఎం రేవంత్‌ ప్రశ్నించారు. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో సానుభూతి కన్నీళ్ల ముసుగులో గెలవాలని అనుకుంటే.. అక్కడి ప్రజలు అభివృద్ధి కావాలంటూ శ్రీగణేష్‌ను గెలిపించారని తెలిపారు. కంటోన్మెంట్‌లో ఎన్నో ఏళ్లుగా ట్రాఫిక్‌ ఇబ్బందిగా మారిన ఎలివేటెడ్‌ కారిడార్లను, రోడ్డు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తున్నామని, రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు సాగుతున్నాయని అన్నారు. జూబ్లీహిల్స్‌ ప్రాంతం నుంచి ఓట్లు వేయించుకొని సికింద్రాబాద్‌ నుంచి రెండుసార్లు ఎంపీ, కేంద్ర మంత్రి అయిన కిషన్‌రెడ్డి.. మెట్రోరైలుకు, మూసీనది అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ‘‘ఉప ఎన్నిక రాగానే జూబ్లీహిల్స్‌లో కార్పెట్‌ బాంబింగ్‌ చేస్తారట! సిగ్గుండాలి.. పాకిస్థాన్‌ మీద బాంబులు వేయరుగానీ.. జూబ్లీహిల్స్‌లో కార్పెట్‌ బాంబింగ్‌ చేయడానికి ఇదేమైనా బీజేపోళ్లా బాబు జాగీరా? ఎవరైనా అభివృద్ధి చేయాలనుకుంటారు. బీజేపీ వాళ్లు బిచ్చమడిగేందుకు వస్తారా?’’ అంటూ రేవంత్‌ మండిపడ్డారు. నగరాన్ని అభివృద్ధి చేస్తే కాంగ్రెస్‌కు పేరు వస్తుందని, తమకు పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎ్‌సలది ఫెవికాల్‌ బంధమన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ చచ్చిపోయి బీజేపీని గెలిపించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ కేంద్ర మంత్రులుగా రాష్ట్రానికి నయా పైసా తీసుకొచ్చారా? అని నిలదీశారు..


బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే పథకాలు రద్దవుతాయి..

పేదోళ్లు అండగా నిలబడితేనే రెండుసార్లు కేసీఆర్‌ సీఎం అయ్యారని, మోదీ మూడుసార్లు ప్రదాని అయ్యారని సీఎం రేవంత్‌ అన్నారు. కానీ, ఏనాడు పేదలకు రేషన్‌కార్డు, సన్నబియ్యం, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించారా? ప్రశ్నించారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే.. ఆటోవాళ్లను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ బస్సు ఉచితం బంద్‌ చేయాలంటూ ఆటోల్లో తిరుగుతూ ఫొటోలు దిగుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎ్‌సకు ఓటేస్తే పిల్లలకు పెడుతున్న సన్నబియ్య రద్దవుతాయని, పేదోళ్లకు రూ.200 ఉచిత విద్యుత్‌ బంద్‌ అవుతుందని, 25 వేల మందికి ఇచ్చిన రేషన్‌కార్డులు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రద్దవుతాయని తెలిపారు. కన్నీళ్లతో మోసగించే ప్రయత్నం చేస్తున్నారని, సెంటిమెంట్‌ ముసుగులో అభివృద్ధిని ఆపుకోవద్దని సూచించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అజరుద్దీన్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తామన్నామని, ఆయన ఓడిపోయినా.. ఆనాటి మాట ప్రకారం ఆయనను మంత్రిని చేసి ప్రచారానికి వచ్చానని గుర్తు చేశారు. ‘మీరు ఒక్క ఓటు వేస్తే నవీన్‌ ఎమ్మెల్యే అవుతారు.. అజరుద్దీన్‌ మంత్రిగా మీ సమస్యలను పరిష్కరిస్తారు. అజరుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే బీజేపీకి కడుపునొప్పి ఎందుకు? బీఆర్‌ఎ్‌సకు దుఃఖం ఎందుకు? ఓ మైనారిటీ మంత్రిగా.. భారత క్రికెట్‌ జట్టుకు కెప్టెన్సీ వహించిన అజరుద్దీన్‌ మంత్రివర్గంలో ఉండొద్దా?’’ అని రేవంత్‌ నిలదీశారు. తమ మంత్రులు ఇక్కడి సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే అభివృద్ధి పనులు ప్రారంభించామని, బీఆర్‌ఎస్‌ గెలిస్తే ఆ పనులు నిలిచిపోతాయని అన్నారు.


మహిళలకు మంత్రి పదవి ఎందుకివ్వలేదు?

2014 నుంచి 2019 వరకు ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించలేదని, ఆడబిడ్డలు రాజ్యాన్ని నడపలేరా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. వారు చేసిన మోసానికి సొంత చెల్లెలు ఇల్లిల్లు తిరుగుతోందని, ఇంటి ఆడబిడ్డ కంటతడి పెడుతున్నా కనీసం కనికరం లేదని విమర్శించారు. రూ.వేల కోట్ల ప్రజల సొమ్మును పందికొక్కులా దోచుకొని ఆడిబిడ్డను జైలుకు పంపారని, బయటకు వచ్చాక ఆమెను ఆదుకునే పరిస్థితి కూడా లేదని ధ్జమెత్తారు. తనను బయటకు గెంటేశారని సొంత ఆడబిడ్డే అంటోందన్నారు. ‘‘మీ పిల్లల భవిష్యత్తు కోసం గంజాయి, డ్రగ్స్‌ నిషేదించాం. కానీ ఫామ్‌హౌజుల్లో గంజాయి, డ్రగ్స్‌తో దొరికితే వాళ్లపై కేసులు పెట్టొద్దంటున్నారు. గంజాయి, డ్రగ్స్‌తో దొరికినవాళ్లు రౌడీలా? పేదల కోసం నిలబడ్డ నవీన్‌ యాదవ్‌ రౌడీనా? ఈ పోటీ జూబ్లీహిల్స్‌కు పరిమితం కాదు. రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకొని.. జూబ్లీహిల్స్‌లో ముసుగేసుకొని వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌ అభిమానులు కానోళ్లు ఉంటారా? అమీర్‌పేటలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పెట్టే బాధ్యత నాది’’ అని రేవంత్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, అజరుద్దీన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షగౌడ్‌, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు.


నేడు బోరబండ, ఎర్రగడ్డలో సీఎం రేవంత్‌ ప్రచారం

సీఎం రేవంత్‌రెడ్డి శనివారం జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 7 రాత్రి 9 గంటలవరకు ఈ ప్రచారం కొనసాగనుంది.

దేశ గౌరవాన్ని కించపరిచేలా సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు

ప్రజలకు సైనికులకు క్షమాపణ చెప్పాలి: బండి సంజయ్‌

దేశగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి దేశ ప్రజలకు, సైనికులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. పాక్‌ దాడి చేసినా భారత్‌ స్పందించలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పాక్‌ ఉగ్రవాద శిబిరాలను ధ్వసం చేసిన మన సైనికుల ధైర్యసాహసాలనే అవమానించేలా ఉన్నాయన్నారు. శుక్రవారం ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఆపరేషన్‌ సిందూర్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిందని గుర్తు చేశారు. ఉగ్రవాదంపై ప్రధాని మోదీ కఠిన చర్యలకు ఇది ప్రతీకని పేర్కొన్నారు.

Updated Date - Nov 01 , 2025 | 06:33 AM