CM Revanth Reddy to Visit Maharashtra: త్వరలో మహారాష్ట్రకు సీఎం రేవంత్‌రెడ్డి!
ABN , Publish Date - Oct 19 , 2025 | 04:00 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి త్వరలో మహారాష్ట్రకు వెళ్లనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత...
150 మీటర్లతో తుమ్మిడిహెట్టి బ్యారేజీకి అనుమతి కోసం
ఆ రాష్ట్ర సీఎం ఫడణవీ్‌సను కలవనున్న తెలంగాణ సీఎం
వారం, పది రోజుల్లో పర్యటన ఉండే అవకాశం: ఉత్తమ్
హైదరాబాద్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి త్వరలో మహారాష్ట్రకు వెళ్లనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకం పనుల పునరుద్ధరణలో భాగంగా 150 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించడానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ సమ్మతి కోరనున్నారు. వారం, పది రోజుల్లో ఈ పర్యటన ఉండే అవకాశముందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాగా, 150 మీటర్లతో బ్యారేజీ నిర్మాణంతో ఏర్పడే ముంపునకు సంబంధించి అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ ముంపుపై పుణెలోని కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన కేంద్రం(సీడబ్ల్యూపీఆర్‌ఎస్) అధ్యయనం కూడా చేసింది. 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కడితే 288.01 ఎకరాలు ముంపునకు గురవుతాయని, 149 మీటర్ల ఎత్తుతో కడితే 770.53 ఎకరాలు, 150 మీటర్లతో కడితే 1467.92 ఎకరాలు ముంపునకు గురవుతాయని సీడబ్ల్యూపీఆర్‌ఎస్ లెక్క తేల్చింది. దాంతో ఆ నివేదిక ఆధారంగా మహారాష్ట్ర సీఎంను కలిసి.. ఎలాగైనా 150 మీటర్లతో బ్యారేజీ నిర్మాణానికి సమ్మతి తెలపాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరే అవకాశం ఉంది. మహారాష్ట్రలో అమల్లో ఉన్న 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి నిర్వాసితులకు గరిష్ఠ పరిహారం ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెప్పే అవకాశాలున్నాయి. భూసేకరణ కోసం పరిహారంతోపాటు పునరావాసం, పునర్‌నిర్మాణం కింద ఎకరానికి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు మహారాష్ట్ర సీఎంకు తెలపనుంది.
గతంలోనూ రెండు ప్రభుత్వాల ఒప్పందం..
వాస్తవానికి 2016 మార్చి 8న తుమ్మిడిహెట్టిని 148 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా జరిగింది. అప్పట్లో కూడా సీఎంగా దేవేంద్ర ఫడణవీసే ఉన్నారు. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కోసం కూడా ఒప్పందం చేసుకున్నారు. అయితే తుమ్మిడిహెట్టితోపాటే మేడిగడ్డను కూడా కడతామని అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కానీ, కాలక్రమంలో తుమ్మిడిహెట్టిని పక్కన పెట్టింది. 2023 అక్టోబరు 21న కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్లలో సీపేజీలు ఏర్పడటంతో.. తుమ్మిడిహెట్టి పునరుద్ధరణపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టింది.