Review Designs: నేడు మేడారానికి సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Sep 23 , 2025 | 07:31 AM
సమ్మక్క-సారలమ్మ జాతర అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు గద్దెల ప్రాంగంణం విస్తరణ, డిజైన్లపై సమీక్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం మేడారం రానున్నారు.
అమ్మవార్ల గద్దెల ప్రాంగణం డిజైన్లపై సమీక్ష
జాతరలో చేపట్టే అభివృద్ధి పనులకూ శంకుస్థాపన
ములుగు/తాడ్వాయి/వరంగల్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సమ్మక్క-సారలమ్మ జాతర అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు గద్దెల ప్రాంగంణం విస్తరణ, డిజైన్లపై సమీక్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం మేడారం రానున్నారు. ప్రతి రెండేళ్లకోసారి జాతరకు ముందు చేపట్టే అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం సీఎం రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరిగే జాతరలో భక్తులకు పలు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.150కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో శాశ్వత అభివృద్ధి పనులతోపాటు ప్రకృతి దైవాలైన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను ఆధునికీకరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం ఇక్కడ సమ్మక్క, సారలమ్మ గద్దెలు ఒక వరుసలో, ఆయా గద్దెలకు ఎదురుగా పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఉన్నాయి. భక్తులు క్యూ లైన్‌లో సమ్మక్క, సారలమ్మ దర్శించుకుని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల వద్దకు రావడం ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో నలుగురు గద్దెలను ఒకే వరుసలో నిర్మించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం గద్దెల చుట్టూ ఉన్న ఇనుప (స్టీల్) గ్రిల్స్‌ను తొలగించి.. గ్రానైట్‌తో నిర్మించాలని యోచిస్తున్నారు. గిరిజన పూజారుల అభిప్రాయాలకు అనుగుణంగా నాలుగైదు రకాలుగా గద్దెల డిజైన్లను అధికారులు రూపొందించారు. సీఎం రేవంత్ సమీక్ష సందర్భంగా ఒక డిజైన్‌ను ఖరారు చేసి, శంకుస్థాపన చేయనున్నారు.
ప్రస్తుతం 32 గుంటల్లో ఉన్న తల్లుల గద్దెల ప్రాంగణం ఉండగా, నాలుగు వైపులా మరో 20 అడుగుల మేర విస్తరించాలని భావిస్తున్నారు. గద్దెల ప్రాంగణం విస్తరణ, అతిథి గృహాల నిర్మాణానికి మొత్తం 23 ఎకరాల భూమిని సేకరించనున్నారు. జంపన్న వాగుపై ఎప్పటికీ నీరు నిలిచి ఉండేలా.. రెండు, మూడు చోట్ల చెక్ డ్యామ్‌లను నిరించాలన్న ప్రతిపాదనలు ఉండగా.. గత అనుభవాల దృష్ట్యా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. భక్తుల విశ్వాసాలకు భంగం కలుగకుండా జంపన్నవాగులో నిరంతం నీళ్లు పారేలా ప్రణాళిక రూపొందించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, సీఎం పర్యటనలో భాగంగా ఐలాపూర్ వరకు రోడ్డు నిర్మాణం, జాతర ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు.