CM Revanth Reddy: నేడు నర్సంపేటకు సీఎం రేవంత్
ABN , Publish Date - Dec 05 , 2025 | 03:08 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేటలో శుక్రవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.531 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు......
రూ.531కోట్ల పనులకు శంకుస్థాపన
సీఎం, మాధవరెడ్డి మధ్య సయోధ్య!
వరంగల్/హైదరాబాద్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేటలో శుక్రవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.531 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్‌లో నర్సంపేటకు రానున్న సీఎం.. రూ.200కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి భూమి పూజ నిర్వహిస్తారు. అలాగేరూ.130 కోట్లతో నిర్మించే మెడికల్ కాలేజీ భవనాలకు, రూ.25కోట్లతో నిర్మించే నర్సింగ్ కాలేజీ భవనాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.20 కోట్లతో నర్సంపేట మునిసిపాలిటీ పరిధిలో చేపట్టే సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు. రూ.82.56కోట్లతో వరంగల్-నర్సంపేట నాలుగు లైన్ల రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు.అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు నర్సంపేట శివారులోని మెడికల్ కాలేజీ సమీపంలో జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. మరోవైపు సీఎంతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ఉన్న విభేదాలు తొలిగినట్లేననే చర్చ జరుగుతోంది. మొదట్నుంచీ సీఎం రేవంత్‌తో మాధవరెడ్డికి విభేదాలున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆయన ఏడాదికి పైగా సీఎంను కలవనే లేదు. రేవంత్ వరంగల్‌కు వచ్చిన సందర్భాల్లోనూ మాధవరెడ్డి దూరంగానే ఉ న్నారు. అయితే, ఇటీవల ఆయన తల్లి మృతి చెందడంతో సీఎం పరామర్శకు ఇంటికి రావటంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదరిందనే టాక్ వినపడుతోంది. కాగా, రాష్ట్రంలో ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిపై ఈనెల 6న సీఎం రేవంత్ సమీక్షించనున్నారు. ఆయా ప్రాజెక్టులకు నిధులు, మూడేళ్లలో పూర్తి చేసే ప్రాజెక్టులపై ఇందులో చర్చించే అవకాశముంది.