CM Revanth Reddy Seeks Centre Support: హైదరాబాద్ అభివృద్ధికి సహకరించండి
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:07 AM
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. వివిధ అభివృద్ధి పనులకు అనుమతులు వేగంగా జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.....
పనులకు అనుమతులు వేగంగా మంజూరు చేయండి
దక్షిణ-పశ్చిమ ప్రాంతాల ప్రాంతీయ సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. వివిధ అభివృద్ధి పనులకు అనుమతులు వేగంగా జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్‌రోడ్డు, గోదావరి జలాల తరలింపు, మూసీ ప్రక్షాళనకు సహకరించాలన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో దక్షిణ-పశ్చిమ రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల ప్రాంతీయ సమావేశం జరిగింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. రాబోయే ఏడాదిలో 3వేల విద్యుత్తు బస్సులను హైదరాబాద్ నగరంలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబరు 9న తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తున్నామన్నారు. 2034 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థలో 10 శాతం తెలంగాణ నుంచే అందించాలని భావిస్తున్నామన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధితోపాటు భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నామని, రాష్ట్రంలో డ్రై పోర్టు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. తమ పోటీ.. దేశంలోని ఇతర రాష్ట్రాల నగరాలతో కాదని, సింగపూర్, టోక్యో, న్యూయార్క్ నగరాలతో పోటీ పడుతున్నామని అన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమన్నారు. నగరాలు వికసిత్ భారత్‌కు అద్దాల వంటివని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అన్నారు. సమష్టిగా ముందుకు సాగేందుకు ఈ తరహా సమావేశాలు దోహదపడతాయని తెలిపారు. స్వచ్ఛభారత్ మిషన్-అర్బన్ కింద చేపట్టిన డంప్‌సైట్ రెమెడియేషన్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ (డీఆర్‌ఏపీ), లెగసీ వేస్ట్ డంప్‌సైట్ల స్థితిగతులపై కేంద్ర మంత్రి ఆరా తీశారు. వంద శాతం ఫలితాలు సాధించేందుకు వీలుగా ఈ స్థలాలను దత్తత తీసుకునేందుకు మంత్రులు ముందుకు రావాలన్నారు. డీఆర్‌ఏపీ కింద 214 ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్ర 5 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, నిధుల విడుదల, రాష్ట్ర ప్రభుత్వాల మ్యాచింగ్ గ్రాంట్ తదితర అంశాలపై చర్చించారు. అమృత్ పథకం కింద మంచి నీటి సరఫరా మెరుగుపరచడం, శుద్ధి చేసిన నీటి పునర్వినియోగ ప్రణాళికలు, వర్షపునీటి నిల్వ, జల వనరుల పునరుజ్జీవంపై చర్చించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన- అర్బన్ కింద చేపట్టిన గృహ నిర్మాణ పురోగతిపైనా సమీక్షించారు. తొలి విడత చర్చల్లోహైదరాబాద్ పట్టణ ప్రాథమ్యాలను ప్రదర్శిస్తూ తెలంగాణ రైజింగ్-2047 విజన్‌పై చర్చించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. రెండో విడత చర్చల్లో రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర పథకాలు, వాటి పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పురపాలకశాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.