CM Revanth Reddy: సర్కారీ పథకాలకుడిస్కమ్!
ABN , Publish Date - Sep 17 , 2025 | 06:04 AM
రాష్ట్రంలో సర్కారీ పథకాల కరెంటు కనెక్షన్ల కోసం కొత్తగా విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్) ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. తెలంగాణలో ప్రస్తుతం దక్షిణ ప్రాంతం కోసం హైదరాబాద్...
వ్యవసాయ పంపుసెట్లు, ఎత్తిపోతలన్నీ దాని పరిధిలోకే..
రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తర్వాత ఏర్పాటు!
కొత్త డిస్కమ్‌పై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
రెండున్నరేళ్లలో కోర్ అర్బన్ రీజియన్‌లో
భూగర్భ విద్యుత్తు తీగల ఏర్పాటు పూర్తి కావాలి
కర్ణాటక తదితర రాష్ట్రాల్లో అధ్యయనం చేయండి
డిసెంబరులోగా పూర్తిస్థాయి ప్రణాళికలు
సౌర విద్యుత్తు వినియోగాన్ని ప్రోత్సహించండి
అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సర్కారీ పథకాల కరెంటు కనెక్షన్ల కోసం కొత్తగా విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్) ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. తెలంగాణలో ప్రస్తుతం దక్షిణ ప్రాంతం కోసం హైదరాబాద్ కేంద్రంగా ఎస్పీడీసీఎల్, ఉత్తర ప్రాంతం కోసం హనుమకొండ కేంద్రంగా ఎన్పీడీసీఎల్ ఉన్నాయి. ఇవిగాక కొత్తగా ఒక డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కొద్ది రోజుల కిందట ఇంధన శాఖను ఆదేశించిన సంగతి తెలిసిందే. 28 లక్షల వ్యవసాయ పంపుసెట్లు, ఎత్తిపోతల పథకాలు, గ్రామీణ తాగునీటి సరఫరా, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వంటి పథకాల విద్యుత్తు కనెక్షన్ల కోసం కొత్తగా డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తోంది. ఈ క్రమంలో కొత్త డిస్కమ్ ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేశారు. మంగళవారం దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రస్తు తం ఉన్న 2డిస్కమ్‌లను 3డిస్కమ్‌లుగా పునర్వ్యవస్థీకరించాలని సీఎం అధికారులకు సూచించారు. మూడో డిస్కమ్ కోసం విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)లు, ఆస్తులవిభజన, బకాయిలు, ఇతర అంశాలపై కీలక సూచనలు చేశారు. కొత్త డిస్కమ్ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం లభించిన అనంతరం ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈలోగా కొత్త డిస్కమ్ ప్రతిపాదనకు తుదిరూపు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
జీహెచ్‌ఎంసీలో భూగర్భ విద్యుత్తు వైర్లు..
గ్రేటర్ హైదరాబాద్‌లో భూగర్భ విద్యుత్తు తీగల ఏర్పాటుకు సిద్ధం చేసిన ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారీ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తొలుత కోర్ అర్బన్ రీజియన్‌లో భూగర్భ తీగలతో పాటు సబ్‌స్టేషన్లను ఉన్నతీకరించాలని, ఓవర్‌లోడ్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. సబ్‌స్టేషన్ సామర్థ్యాని కంటే ఒక్క కనెక్షన్ కూడా ఎక్కువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే కోర్ అర్బన్ రీజియన్‌లో కొత్తగా సబ్‌స్టేషన్లు ఎక్కడెక్కడ అవసరం ఉందనేది గుర్తించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని సబ్‌స్టేషన్లలో అధునాతన సాంకేతికతను ఉపయోగించాలని సూచించారు. విద్యుత్తు తీగలతో పాటు ఇతర కేబుళ్లకు కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను ఉపయోగించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలన్నారు. బెంగళూరుతో పాటు ఇతర రాష్ట్రాల్లోని అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టులను అధ్యయనం చేయాలని చెప్పారు. డిసెంబరులోగా అండర్ గ్రౌండ్ కేబులింగ్‌కు సంబంధించిన పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలని, రాబోయే రెండున్నరేళ్లలో కోర్ అర్బన్ రీజియన్‌లో అండర్ గ్రౌండ్ కేబులింగ్‌ను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
సౌర విద్యుత్తు వినియోగాన్ని ప్రోత్సహించండి
రాష్ట్రంలో సౌర విద్యుత్తు వినియోగాన్ని ప్రోత్సహించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సోలార్ రూఫ్‌టాప్ విలేజ్ పనుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఇందిర సౌర గిరి జల వికాసం ద్వారా రైతులకు సౌర పంపుసెట్లు అందించాలని, వాటికి కంటెయినర్ బేస్డ్ సౌర ఫలకాల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. సౌర విద్యుదుత్పత్తితో మహిళా రైతులకు ఆదాయం సమకూర్చడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, భవనాలపై సౌర ఫలకలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో సాధ్యమైనంత ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు.
అంధ విద్యార్థులకు సంగీత వాయిద్య పరికరాలు పంపిణీ
కరీంనగర్ జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సంగీతంలో శిక్షణ పొందిన అంధ విద్యార్థులు పలువురికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం సంగీత వాయిద్య పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంధ విద్యార్థులు సీఎం ఎదుట పాట పాడి వినిపించారు. అనంతరం విద్యార్థులు పాడిన పాటలతో రూపొందించిన సీడీని మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి సీఎం రేవంత్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు.