Share News

CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు ప్రధానమంత్రిని ఆహ్వానిద్దాం

ABN , Publish Date - Nov 27 , 2025 | 04:41 AM

ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, వివిధ శాఖల కేంద్ర మంత్రులను ఆహ్వానిద్దామని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో ...

CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు ప్రధానమంత్రిని ఆహ్వానిద్దాం

  • వివిధ శాఖల కేంద్ర మంత్రులను కూడా.. ఆహ్వానితులకు లోటు లేకుండా ఏర్పాట్లు ఉండాలి

  • మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి

  • ‘తెలంగాణ రైజింగ్‌’పై రెండో రోజు సమీక్ష

  • మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగాపోలీసులు నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలి

  • నూతన ఐపీఎస్‌ ప్రొబేషనర్లకు సీఎం దిశానిర్దేశం

హైదరాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించే ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌’కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, వివిధ శాఖల కేంద్ర మంత్రులను ఆహ్వానిద్దామని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో అన్నారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రముఖులను ఆహ్వానించాల్సి ఉంటుందని, వారి జాబితాను ముందస్తుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆహ్వానితులకు అనుగుణంగా ఎక్కడా లోటు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. సమ్మిట్‌లో పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. తెలంగాణ రైజింగ్‌ డాక్యుమెంట్‌ రూపకల్పనపై బుధవారం రెండో రోజు పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 2,600 మంది ఆహ్వానితులకు ఇప్పటికే ఆహ్వానాలు అందించామని అధికారులు సీఎంకు తెలిపారు. సదస్సులో ఏర్పాటు చేసే స్టాళ్ల డిజైన్లను కూడా వివరించారు. దీంతో మౌలిక సదుపాయాలు, సంక్షేమం, పరిశ్రమలు, వైద్యంతోపాటు వివిధ విభాగాలకు చెందిన స్టాళ్ల ఏర్పాటు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలను సిద్ధం చేయాలని, వారికి ఇచ్చే సమయాన్ని ముందుగానే నిర్ణయించాలని అన్నారు. ఈవెంట్ల వారీగా.. ఒక్కో ఈవెంట్‌కు ఒక్కో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని బాధ్యుడిగా నియమించాలన్నారు. తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచేలా డ్రోన్‌ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెలాఖరులోగా గ్లోబల్‌ సమ్మిట్‌కు సంబంధించిన అన్ని డిజైన్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


పోలీసు శాఖను ఆధునికీకరిస్తున్నాం..

సమాజంలో నేరాల స్వరూపం వేగంగా మారుతున్న నేపథ్యంలో ప్రజల అంచనాలకు అనుగణంగా పోలీసు శాఖను ఆధునికీకరిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సైబర్‌ నేరగాళ్లు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వాడుతున్నందున పోలీసులు అందుకు దీటుగా తమ సాంకేతికతను పెంచుకోవాలన్నారు. తెలంగాణకు కేటాయించిన నలుగురు ఐపీఎస్‌ ప్రొబేషనర్లు ఆయేషా ఫాతిమా, మనీషా నెహ్రా, మంధరె సోహన్‌ సునీల్‌, రాహుల్‌కాంత్‌ బుధవారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పోలీసు అకాడమీ డైరక్టర్‌ అభిలాష్‌ బిస్త్‌ వారిని ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పోలీసింగ్‌పై తన లక్ష్యాలను వారితో పంచుకున్నారు. మాదక ద్రవ్యాలు, ఉగ్రవాద సంబంఽధిత కేసుల దర్యాప్తులో నైపుణ్యం పెంచుకోవాలన్నారు. గుంపులను నియంత్రించడం, విపత్తులో వేగవంతమైన స్పందన అవసరమని, పౌరులతో మెరుగైన అవగాహన కోసం తెలుగులో మాట్లాడటం తప్పనిసరి అని పేర్కొన్నారు. తెలుగు భాషలో ప్రావీణ్యం సంపాదించుకోవాలని సూచించారు.

Updated Date - Nov 27 , 2025 | 04:41 AM