Panchayat Elections: అక్కడ ఎందుకు గెలవలేకపోయాం
ABN , Publish Date - Dec 21 , 2025 | 05:35 AM
ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీచేసిన అభ్యర్థుల్లో అత్యధిక శాతం గెలుపొందిన జిల్లాల్లో ఉమ్మడి నిజామాబాద్...
18 నియోజకవర్గాల్లో సర్పంచ్ స్థానాలు తగ్గటంపై హస్తం సమీక్ష
ముఖ్యమంత్రి రేవంత్, మీనాక్షి, పీసీసీ చీఫ్ మహేశ్‌ల మధ్య చర్చ
ఐదుగురు ఎమ్మెల్యేలకు నేరుగా ఫోన్ చేసి అడిగిన సీఎం
నివేదిక ఇవ్వాలని ఆదేశం
రెబల్స్ స్వతంత్రులుగా పోటీ చేయటానికి కారణాలపై ఆరా
మరి కొందరు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులకు పీసీసీ చీఫ్ ఫోన్
హైదరాబాద్, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీచేసిన అభ్యర్థుల్లో అత్యధిక శాతం గెలుపొందిన జిల్లాల్లో ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం ఉన్నాయి. కానీ, నిజామాబాద్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆ స్థాయిలో సీట్లు రాలేదు. ఖమ్మం జిల్లాలో కూడా ఒక నియోజకవర్గంలో అంతంతమాత్రంగానే సీట్లు వచ్చాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన ఒక నాయకుడి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. ఎందుకిలా జరిగింది? మిగిలిన చోట్ల వచ్చినట్లుగా ఇక్కడ మంచి ఫలితాలు ఎందుకు తేలేకపోయారు? అన్నదానిపై అధికార కాంగ్రెస్ దృష్టిపెట్టింది. ఈ జిల్లాల్లోనే కాదు... ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ తదితర జిల్లాల్లో కలిపి మొత్తం 18 అసెంబ్లీ స్థానాల్లో ఈ పరిస్థితి నెలకొందని, ఆయా స్థానాల్లో ప్రతిపక్షాల కంటే తక్కువ సీట్లు రావడానికి స్థానిక నేతలే కారణమని ఆగ్రహంగా ఉంది. ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ స్థానంతో సహా రాష్ట్రవ్యాప్తంగా 87 నియోజకవర్గాల్లో తమకే ఎక్కువ సర్పంచ్ స్థానాలు వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి గర్వంగా ప్రకటించారు. అదే సమయంలో తమకు ఎక్కడెక్కడ తక్కువ సీట్లు వచ్చాయన్న దానిపైనా దృష్టిపెట్టారు. మొత్తం 18అసెంబ్లీ స్థానాల పరిధిలో కాంగ్రె్‌సకు సరైన ఫలితాలు రాలేదని గుర్తించారు. ఈ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌తో సీఎం శనివారం చర్చించారు. అంతేకాదు... ఆయనే స్వయంగా ఐదుగురు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా సానుకూలత ఉండగా, వారి దగ్గర మాత్రమే ఎందుకు వ్యతిరేక ఫలితాలు వచ్చాయని ప్రశ్నించారు. మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ కూడా కొందరితో ఫోన్‌లో మాట్లాడారు. ఆ 18 నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలుంటే వారితో.. లేనిచోట నియోజకవర్గ కాంగ్రెస్‌ఇన్‌చార్జుల్లోని కొందరితో మాట్లాడి... ఆశించిన స్థాయిలో సర్పంచ్‌లను ఎందుకు గెలిపించలేకపోయారని ప్రశ్నించారు. ఈ అంశంపై నివేదికలు పంపాలని డీసీసీ అధ్యక్షులను కోరారు. నివేదికలు వచ్చాక ఆ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులను పిలిచి వివరణ అడగనున్నట్లు తెలిసింది.
రెబల్స్ బరిలోకి ఎందుకు దిగాల్సి వచ్చింది?
సర్పంచ్ ఎన్నికల్లో రెబెల్స్, స్వతంత్రులుగా పోటీచేసి గెలిచినవారు ఈసారి 10 శాతం వరకు ఉన్నారు. 12,707 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే, 1,262 మంది స్వతంత్ర అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధించారు. ఇందులో 80 శాతం మంది కాంగ్రె్‌సకు చెందినవారే. ఇంతపెద్ద సంఖ్యలో గెలుపొందే సత్తా ఉన్న అభ్యర్థులకు కాకుండా... వేరే వారికి పార్టీ తరఫున మద్దతు ఎలా ఇచ్చారు? స్థానిక నేతలను ఎందుకు సమన్వయం చేయలేకపోయారనే అంశంపై కూడా డీసీసీలను నివేదికలు కోరింది. ఇలాంటి చోట్ల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు పార్టీపరంగా ఆదరణ ఉన్న నేతలకు కాకుండా...వారి బంధువులు, అనుచరులకు మద్దతు ఇచ్చారన్న అంశం సీఎం దృష్టిలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ స్థానాలు గెలవడం సంతోషకరమే అయినా... ఎక్కడ తక్కువ వచ్చాయో చూసుకుని సరిచేసుకోవడంపై దృష్టిసారించామని పార్టీ నేత ఒకరు తెలిపారు.
రాబోయే ఎన్నికలకు సన్నాహాలు
వచ్చే ఏడాది జనవరిలోమిగతా స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ భావిస్తున్నాయి. తొలుత మున్సిపల్ ఎన్నికలు, తర్వాత జ డ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నాయి. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు చేపట్టిన అంతర్గత విశ్లేషణతో తక్కువ పంచాయతీలు గెలుచుకున్న ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీచేయడం రాబోయే ఎన్నికల్లో ఉపకరిస్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల పొత్తుల విషయంలో సరైన ముందుచూపుతో వ్యవహరించలేదన్న అభిప్రాయం కూడా పార్టీలో ఉంది. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలతో ముందస్తు అవగాహన కుదుర్చుకోకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో సీట్లు గెలవలేకపోయామన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది.
ఖర్గేకు ఘన స్వాగతం
ఢిల్లీ నుంచి కర్ణాటకలోని గుల్బర్గా పర్యటనకు వెళ్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు శనివారం హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీ విమానాశ్రయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్, మంత్రి శ్రీధర్‌బాబు, ప్రొటోకాల్ చైర్మన్ వేణుగోపాల్ ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. శంషాబాద్‌కు విమానంలో వచ్చిన ఖర్గే.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గుల్బర్గా వెళ్లారు.