Share News

CM Revanth Reddy: ఆర్‌ఆర్‌ఆర్‌కు ఒకే నంబరు

ABN , Publish Date - Sep 23 , 2025 | 06:20 AM

రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర, దక్షిణ భాగాలను రెండు వేర్వురు ప్రాజెక్టులుగా చూడొద్దని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులతో....

CM Revanth Reddy: ఆర్‌ఆర్‌ఆర్‌కు ఒకే నంబరు

  • దక్షిణ భాగానికీ ఉత్తర భాగం నంబరే ఇవ్వాలి.. ఏకకాలంలో రెండింటి పనులకు సహకరించాలి

  • ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను కోరిన సీఎం.. వేగిరంగా భూసేకరణ, పరిహారం పంపిణీ

  • అలసత్వం ప్రదర్శించే అధికారులపై వేటు.. హైవేలు, కోర్‌ అర్బన్‌ ప్రాంత అభివృద్ధిపై సీఎం సమీక్ష

  • సమ్మక్క సాగర్‌కు ఎన్‌వోసీ!.. సూత్రప్రాయంగా ఛత్తీస్‌గఢ్ అంగీకారం

  • ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయితో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సంప్రదింపులు ఫలప్రదం

హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర, దక్షిణ భాగాలను రెండు వేర్వురు ప్రాజెక్టులుగా చూడొద్దని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఉత్తర భాగానికి కేటాయించిన నంబరునే దక్షిణ భాగానికి కూడా కొనసాగించాలని కోరారు. అందుకు వెంటనే అనుమతులు మంజూరు చేయడంతోపాటు ఏకకాలంలో రెండింటి పనులు ప్రారంభించేందుకు సహకరించాలన్నారు. దక్షిణభాగం అలైన్‌మెంట్‌కు వెంటనే ఆమోదముద్ర వేసేలా చూడాలన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, అనుమతుల జారీ, నూతన ప్రతిపాదనలకు ఆమోదం తదితర అంశాలపై ఎన్‌హెచ్‌ఏఐ, జాతీయ రహదారుల విభాగం (ఎన్‌హెచ్‌), జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్‌), రహదారులు, భవనాల శాఖ, అటవీ శాఖ అధికారులతో సోమవారం సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, పరిహారం పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న చిన్న కారణాలతో రహదారుల నిర్మాణంలో జాప్యం చేయొద్దన్నారు.


ఫ్యూచర్‌ సిటీ రోడ్డుకు అనుమతివ్వండి..

భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నుంచి అమరావతి, మచిలీపట్నం వరకు 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు వెంటనే అనుమతులు ఇవ్వాలని, అలైన్‌మెంట్‌ ఖరారు చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఈ హైవేతో రెండు రాష్ర్టాల రాజధానుల మధ్య అనుసంధానం ఏర్పడుతుందన్నారు. ఈ రహదారికి సమాంతరంగా తాము రైలు మార్గం అడుగుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌-శ్రీశైలం మార్గంలో రావిర్యాల-మన్ననూర్‌కు సంబంధించి ఎలివేటెడ్‌ కారిడార్‌కు వెంటనే అనుమతులు మంజూరు చేసి పనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌-మంచిర్యాల-నాగ్‌పూర్‌ నూతన రహదారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమర్పించిన ప్రతిపాదనలనే అంగీకరించాలని కోరారు. హైదరాబాద్‌-మన్నెగూడ రహదారిలో మర్రి చెట్ల తొలగింపునకు సంబంధించి నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో ఉన్న కేసు పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని సీఎస్‌ రామకృష్ణారావుకు సూచించారు.


జాప్యం చేస్తే వేటు తప్పదు..

మంచిర్యాల-వరంగల్‌-ఖమ్మం-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-163జీ), ఆర్మూర్‌-జగిత్యాల-మంచిర్యాల (ఎన్‌హెచ్‌-63), జగిత్యాల-కరీంనగర్‌ (ఎన్‌హెచ్‌-563), మహబూబ్‌నగర్‌-మరికల్‌-దేవ్‌సుగూర్‌ (ఎన్‌హెచ్‌-167) రహదారులకు సంబంధించి భూసేకరణ, పరిహారం పంపిణీలో జాప్యంపై ఆయా జిల్లాల కలెక్టర్లను వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. పలుచోట్ల కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వారు చెప్పగా.. అన్ని జిల్లాల్లోని కేసులపై నివేదిక రూపొందించి వారంలోపు అడ్వకేట్‌ జనరల్‌తో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎ్‌సను ఆదేశించారు. భూసేకరణ, పరిహారం పంపిణీని అక్టోబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని, అలసత్వం చూపే కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లపై వేటు వేస్తామని హెచ్చరించారు. అటవీ, పర్యావరణ శాఖ పెడుతున్న కొర్రీలపైనా సీఎం సమీక్షించారు. 2002 నుంచి 2022 వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అటవీ, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారని, దాంతో ప్రస్తుతం అనుమతులు ఇవ్వడం లేదని ఫారెస్ట్‌ సౌత్‌ రీజియన్‌ ఐజీ త్రినాథ్‌కుమార్‌ తెలిపారు. దీంతో ఉల్లంఘనల వివరాలు సమర్పించాలని సీఎ్‌సను ఆదేశించారు. అవసరమైన చోట ప్రత్యామ్నాయ భూమిని అటవీ పెంపకానికి ఇస్తామన్నారు. అవసరమైతే కేంద్ర మంత్రులు గడ్కరీ, భూపేందర్‌ యాదవ్‌లతో తాను స్వయంగా భేటీ అవుతానన్నారు. వన్యప్రాణులు లేని అటవీ ప్రాంతాల్లోనూ వన్యప్రాణుల చట్టం అమలు చేస్తున్నారని అన్నారు. తమ కార్యాలయానికి హైదరాబాద్‌లో 2ఎకరాల భూమి కేటాయించాలన్న ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల విజ్ఞప్తికి సీఎం అంగీకరించారు.


గ్లోబల్‌ సిటీకి చిరునామాగా కోర్‌ అర్బన్‌ అభివృద్ధి

తెలంగాణ రైజింగ్‌ కోర్‌ అర్బన్‌ ప్రాంతాన్ని గ్లోబల్‌ సిటీకి చిరునామాగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మానవ జీవన ప్రమాణాలకు కొలమానంగా ఉన్న విద్య , వైద్యం, రోడ్డు రవాణా, పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సోమవారం కోర్‌ అర్బన్‌ ప్రాంత అభివృద్ధి ప్రతిపాదనలపై సచివాలయంలో జరిగిన సమీక్షలో సీఎం మాట్లాడారు. నగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ మేరకు కోర్‌ అర్బన్‌ సిటీ అభివృద్ధి ప్రణాళికలను ఐదు విభాగాలుగా విభజించారు. మొత్తం 111 ప్రతిపాదనలను సీఎంవో ప్రత్యేకాధికారి జయేశ్‌రంజన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కోర్‌ అర్బన్‌ అభివృద్ధిలో భాగంగా ప్రాథమిక విద్యను అందరికీ అందిచేలా సంస్కరణలు చేపట్టాలని ఆదేశించారు. కబ్జాల నుంచి విముక్తి పొందిన ప్రభుత్వ భూముల్లో పాఠశాలల భవనాలు నిర్మించాలని సూచించారు. విద్యార్థులకు టిఫిన్‌, లంచ్‌, స్నాక్స్‌ ప్రభుత్వమే అందించి, ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రపంచంలో హైదరాబాద్‌కు క్లీన్‌ సిటీ ఇమేజ్‌ తీసుకొచ్చేందుకు అధికారులు నిరంతరం శ్రమించాలన్నారు. చెత్త సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పురపాలక శాఖ అధికారులను హెచ్చరించారు. ప్రతి కార్యాలయానికీ సొంత భవనం ఉండేలా స్థలం కేటాయించాలని, వాటిపై సౌరవిద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. పారిశుధ్య పనులకు రోబోలను వాడాలన్నారు. వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయాలన్నారు. డ్రగ్‌ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు అమలు చేయాలని పోలీసులను ఆదేశించారు. డ్రగ్స్‌, గంజాయి కేసుల్లో పట్టుబడిన వారిని బాధితులుగా చూడకుండా కనీసం పది రోజులపాటు పునరావాస కేంద్రాల్లో ఉంచాలన్నారు. ఈ కేంద్రాల నిర్వహణను మాజీ ఆర్మీ అధికారుల పర్యవేక్షణలో ఉంచేలా వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

Updated Date - Sep 23 , 2025 | 06:22 AM