Share News

CM Revanth Reddy: నాలాల కబ్జాలను ఉపేక్షించొద్దు

ABN , Publish Date - Nov 01 , 2025 | 05:45 AM

వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. మొంథా తుఫాన్‌ కారణంగా వానలు దంచికొట్టడంతో వరంగల్‌ నగరంలో పలు కాలనీలు...

CM Revanth Reddy: నాలాల కబ్జాలను ఉపేక్షించొద్దు

  • చెరువుల ఆక్రమణలనూ తొలిగించాల్సిందే.. ఎంతటి వారినైనా వదిలిపెట్టొద్దు

  • పది మంది కోసం పది వేల మందికి ఇబ్బందా?.. అధికారులు చర్యలు తీసుకోవాలి

  • వరద బాధితులకు అండగా ఉంటాం.. తుఫాన్‌ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం

  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం.. ఇళ్లు నీట మునిగితే రూ.15 వేలు..

  • కూలిపోతే ఇందిరమ్మ ఇళ్లు.. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు

  • వరంగల్‌ పర్యటనలో సీఎం రేవంత్‌.. వరద నష్టంపై మంత్రులతో కలిసి ఏరియల్‌ సర్వే

వరంగల్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. మొంథా తుఫాన్‌ కారణంగా వానలు దంచికొట్టడంతో వరంగల్‌ నగరంలో పలు కాలనీలు నీట మునిగిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం వరంగల్‌లోని పలు కాలనీలను సందర్శించి, వరద బాధితులను పరామర్శించారు. వరద ముంపునకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన హనుమకొండ కలెక్టరేట్‌లో ఏడు జిల్లాల కలెక్టర్లతో వరద నష్టంపై సమీక్షించారు. తుఫాన్‌ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో ఉందని రేవంత్‌ చెప్పారు. వరంగల్‌తో పాటు అనేక జిల్లాల్లో వరద నష్టం భారీగా ఉందన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. నీటిపారుదల, పురపాలక శాఖల అధికారులతోపాటు స్థానికంగా ఉండే అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రావడం లేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రతి పైసాను రాబట్టుకోవాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మేఘ విస్ఫోటంతో కుండపోత వానలు నిత్యకృత్యంగా మారాయని, రెండు మూడేళ్లుగా వరసగా ఎక్కడో ఒక చోట ఇలా జరుగుతోందని చెప్పారు. ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు.


నగరాల్లో నాలాల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దన్నారు. చెరవులు, నాలాల కబ్జాల్లో ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దని ఆదేశించారు. పది మంది కోసం పది వేల మంది ప్రజలు ఇబ్బంది పడాలా? అని ప్రశ్నించారు. ఆక్రమణలపై అధికారులు స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వెళ్లాలన్నారు. ప్రస్తుతం వరదలు తగ్గాయని, పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమన్వయ కమిటీలు నియమించుకొని పనిచేయాలని అధికారులకు సూచించారు. వరంగల్‌ స్మార్ట్‌ సిటీ పనుల్ని గడువులోగా పూర్తి చేయాలన్నారు. వరదలకు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖల రోడ్లు భారీగా దెబ్బతిన్నాయని, వాటిపై వెంటనే నివేదికలు అందజేయాలన్నారు. కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు. అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నానని, పని చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. వరద నష్టంపై త్వరలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తానని, నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు.


మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం

వరదల కారణంగా మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. ఎవరైనా వరదల్లో మృతి చెందినట్లు ఫిర్యాదులు వస్తే, వెంటనే ఎఫ్‌ఆర్‌ఐ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. వరదల వల్ల విద్యార్థులు సర్టిఫికెట్లు కోల్పోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వరదలకు ఇళ్లు మునిగిన వారికి రూ.15 వేలు అందిస్తామని, ఇళ్లు పూర్తిగా ధ్వంసమైతే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. అలాగే మేక, గొర్రె వంటివి మృతి చెందితే రూ.5 వేలు; గేదెలు, ఆవులు, ఎద్దులు వంటివి మృతి చెందితే పశువులను బట్టి రూ.50 వేల వరకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల సాయం అందిస్తామని సీఎం రేవంత్‌ చెప్పారు.

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

వరంగల్‌లో వరద బీభత్సానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత కాలనీల్లో స్థానికులు, ప్రజాప్రతినిధుల నుంచి అందిన ఫిర్యాదులను చూసి.. అధికారుల తీరుపై మండిపడ్డారు. వంద అడుగుల రోడ్డులో సుమారు రూ.100 కోట్లతో నిర్మించిన భూగర్భ డ్రైనేజీ టన్నెల్‌ గేట్లను తెరవకపోవడంతో గోపాల్‌పూర్‌ చెరువు నీళ్లతో 50 కాలనీల వరకు నీట మునిగాయని స్థానికులు సీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆయన అధికారులను మందలించారు. తుఫాన్‌ ఉందని తెలిసి కూడా ఎందు కు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పాలనాపరమైన అనుభవం లేకపోవడంతో అధికారులు వరద నష్టాన్ని అంచనా వేయలేకపోయారని ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అధికారులు నిర్లక్ష్యం వీడకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు.


పరామర్శిస్తూ.. భరోసా ఇస్తూ..

వరంగల్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి దాదాపు గంటకుపైగా పర్యటించారు. బాధితులను పలకరిస్తూ.. భరోసా ఇస్తూ.. వారి వినతులు స్వీకరిస్తూ.. ముందుకు సాగారు. మధ్యాహ్నం 3గంటలకు హనుమకొండ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా హనుమకొండ సమ్మయ్య నగర్‌ చేరుకున్న ఆయన.. వరద ముంపు ప్రాంతాలను సందర్శించారు. కాలనీకి చెందిన రమాదేవి, లత ఇళ్లలోకి వెళ్లిన సీఎం.. బాధితులతో మాట్లాడారు. వరద ముంపునకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. రేవంత్‌ మాట్లాడుతుండగా కాలనీ వాసులు అడ్డు తగిలారు. ఏటా వర్షాకాలంలో తాము వరద ముంపుననకు గురవుతున్నామని వాపోయారు. దీంతో శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళిక రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు. సమ్మయ్య నగర్‌ నాలాను పరిశీలించి వెళ్తున్న సీఎంను గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్మికులు కలిశారు. తమ సమస్యలను పరిష్కరించాలని వేడుకున్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని అక్కడే ఉన్న కలెక్టర్‌, మునిసిపల్‌ కమిషనర్‌ను సీఎం ఆదేశించారు. కాపువాడలో వరద బాధితులను పరామర్శించారు. పక్కనే ఉన్న పోతననగర్‌ కాలనీ, నాలాలను పరిశీలించారు. అయితే, పోతననగర్‌లో ఐదారు నిమిషాలు మాత్రమే పర్యటించడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

వరద నష్టంపై ఏరియల్‌ సర్వే

వర్షాలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి మధ్యాహ్నం 1.25గంటలకు హుస్నాబాద్‌ నియోజకవర్గంతోపాటు వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించారు.

ఇందిర, పటేల్‌కు నివాళులు

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సర్దార్‌ వలభ్ల్‌భాయ్‌ పటేల్‌ చిత్ర పటాలకు సీఎం రేవంత్‌రెడ్డి పుష్పాంజలి ఘటించారు. హనుమకొండ కలెక్టరేట్‌ లో ఇందిర వర్ధంతి, పటేల్‌ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2025 | 06:38 AM