Share News

CM Revanth Reddy: కేసీఆర్‌తో మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి

ABN , Publish Date - Dec 07 , 2025 | 05:52 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణను నంబర్‌ వన్‌గా నిలబెట్టామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

CM Revanth Reddy: కేసీఆర్‌తో మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి

  • తనకు కొడుకే గుదిబండ.. వాళ్లను ప్రజలు పట్టించుకోరు

  • పేదలకు ఇళ్లివ్వకుండా సొంతానికి గడీలు కట్టుకున్నారు

  • బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సన్నబియ్యం ఇస్తున్నారా?

  • సేవాలాల్‌ పుణ్యక్షేత్రంగా మద్దిమడుగు అభివృద్ధి చేస్తాం

  • ఇందిరమ్మ చీర కట్టుకొని కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయండి

  • మహిళలకు దేవరకొండ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు

  • మూడేళ్లే కాదు.. మరో ఐదేళ్లూ రేవంతే సీఎం: కోమటిరెడ్డి

నల్లగొండ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణను నంబర్‌ వన్‌గా నిలబెట్టామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వరి పండించడంలో, శాంతి భద్రతలలో, గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనలో, విద్య, వైద్యరంగాల్లో తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలిచిందని చెప్పారు. తెలంగాణ మోడల్‌ను దేశానికే ఆదర్శంగా నిలబెడతామన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల్లో కాళ్లల్లో కట్టెలు పెట్టే వారిని కాకుండా ఎమ్మెల్యేతో, మంత్రులతో కలిసి గ్రామాలను అభివృద్ధి చేసుకునే వారిని గెలిపించుకోవాలని సూచించారు. మద్యానికి అమ్ముడుపోవద్దని సలహా ఇచ్చారు. ఇందిరమ్మ చీర కట్టుకోండి, కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటేయండి అని వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సన్నబియ్యం పథకం అమలైతే చూపించాలని ముఖ్యమంత్రి ఆ పార్టీ నేతలకు సవాలు విసిరారు. ఒక్క ఇందిరమ్మ పాలనలోనే ఈ పథకం అమలవుతోందని వ్యాఖ్యానించారు. 4.50 కోట్ల మంది తెలంగాణ బిడ్డలకు ఈ వేదిక మీద ఉన్న వండుతున్న సన్నబియ్యాన్నే ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పాలనలో కొత్తగా పెళ్లయి అత్తింటికి వచ్చిన కోడళ్ల పేర్లను సైతం కార్డుల్లో చేర్చలేదని విమర్శించారు.


ఈటల రాజేందర్‌, మహమూద్‌ అలీ వంటి మంత్రులను సైతం కేసీఆర్‌ ఇంటి బయట గార్డులు మెడబట్టి గెంటేశారని ఆరోపించారు. అలాంటి కేసీఆర్‌ నిన్న ఇద్దరు సర్పంచులు, నలుగురు వార్డు సభ్యులను పక్కన బెట్టుకొని మనకీ మంచిరోజులు వస్తాయని చెబుతున్నారని, వారిని నమ్మితే వచ్చేవి ‘ముంచే’ రోజులని వ్యాఖ్యానించారు. పదేళ్లు అధికారమిస్తే కేసీఆర్‌, ఆయన కొడుకు, కూతురు, అల్లుడు కలిసి రాష్ట్రాన్ని పీక్కుతిన్నారని, రూ.8లక్షల కోట్ల అప్పులు చేశారని, అయినా ఇంకా ఆశ చావలేదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ పక్కనున్న కొడుకే ఆయనకు గుదిబండ అని చెప్పారు. ప్రజలు ఎప్పటికీ వారిద్దరినీ పట్టించుకోరని అన్నారు. నిలువనీడనిచ్చి పార్టీకి తనింట్లో ఆశ్రయమిచ్చిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ చనిపోతే కనీసం కేసీఆర్‌ పరామర్శించ లేదన్నారు. దేవరకొండ సభకు వచ్చిన 50 వేల మందిలో ఏ ఒక్కరికైనా డబుల్‌ బెడ్‌రూం ఇల్లు వచ్చిందా? అని సీఎం ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లిచ్చిన ఊర్లల్లో తాము ఓట్లు అడుగుతామని, డబుల్‌ బెడ్రూం ఇచ్చిన ఊర్లల్లోనే బీఆర్‌ఎస్‌ ఓట్లు అడగాలని తాను సవాల్‌ విసిరితే కేసీఆర్‌ స్పందించలేదని ఎద్దేవా చేశారు. ఽకేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే పదేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టే అవకాశం ఉందని, పేదలపై ఏ మాత్రం అభిమానం లేకనే ఇల్లు కట్టలేదని చెప్పారు. రాష్ట్రంలో 22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మిస్తున్నామని తెలిపారు. చెంచులకు ఐటీడీఏల పరిధిలో మరో 25వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు.


ఫ్లోరైడ్‌ ప్రభావిత నల్లగొండ జిల్లాలో 3.60 లక్షల ఎకరాల భూమికి సాగునీరిచ్చే ఉద్దేశ్యంతో జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 2005లో ఎస్‌ఎల్‌బీసీని రూ.2 వేల కోట్లతో చేపట్టారని, అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలోనే 30 కిలోమీటర్ల సొరంగం తవ్వారని తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో నల్లగొండపై కక్షగట్టి, సొరంగాన్ని పడావు పడేశారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక తామే ఈ పనులు మొదలుపెడతే దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి, 8 మంది చనిపోయారని కేసీఆర్‌, హరీష్‌ డ్యాన్సులు వేశారని దుయ్యబట్టారు. కేసీఆర్‌, హరీష్ రావు బండ కట్టుకొని శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో దూకినా ఎస్‌ఎల్‌బీసీని, డిండి ప్రాజెక్టుని తమ హయాంలోనే కట్టితీరుతామని ఉద్ఘాటించారు. జైపాల్‌రెడ్డి దేవరకొండలో చదువుకొన్న పాఠశాల, కళాశాలను అభివృద్ధి చేసేందుకు రూ.6 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. సేవాలాల్‌ మహారాజ్‌ అతిపెద్ద విగ్రహాన్ని మద్దిమడుగు వద్ద ఏర్పాటు చేస్తామని, ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. దేవరకొండలో నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌ను ఆదేశించారు.


ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పూర్తి చేస్తాం: ఉత్తమ్‌

వచ్చె అసెంబ్లీ ఎన్నికల లోపే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ని పూర్తిచేసి నల్లగొండ జిల్లాలో 3.60లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని మంత్రి ఉత్తమ్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాకే డిండి ఎత్తిపోతల పనులు రూ.1800కోట్లతో చేపట్టామని చెప్పారు. హైలెవల్‌ కెనాల్‌కు రూ.482కోట్లు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో పేదలందరికీ ఉచితంగా ఆరు కిలోల సన్నబియ్యం ఇస్తున్నామని వివరించారు.

మరో ఐదేళ్లూ రేవంతే సీఎం మంత్రి కోమటిరెడ్డి

ఈ మూడేళ్లే కాదు, మరో అయిదేళ్లూ రేవంత్‌రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. దేవరకొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి తాము ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రాజెక్టు చేపడితే, గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ కుర్చీ వేసుకొని కూర్చొని పనులు పూర్తి చేయిస్తానని చెప్పారే తప్ప పనులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని విమర్శించారు. మళ్లీ తామొచ్చాకే ఈ పనులు మొదలయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో హ్యామ్‌ రోడ్ల కింద రూ.11 వేల కోట్లతో టెండర్లు పిలిచామని, త్వరలో అన్ని ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలు చేపడతామని ప్రకటించారు. దేవరకొండను రెండో కొడంగల్‌ మాదిరిగా సీఎం అభివృద్ధి చేయాలని వెంకట్‌రెడ్డి కోరారు. దేవరకొండ సమగ్ర అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే బాలూనాయక్‌ కోరారు. మహిళలు ఇందిరమ్మ చీరలు ధరించి సభకు రావడం ఆకర్షణగా నిలిచింది.

Updated Date - Dec 07 , 2025 | 06:38 AM