Share News

CM Revanth Reddy: గ్లోబల్‌ విజన్‌ అద్భుతం

ABN , Publish Date - Dec 12 , 2025 | 05:02 AM

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌, విజన్‌ అద్భుతంగా ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ అధిష్ఠానం అభినందించింది. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌..

CM Revanth Reddy: గ్లోబల్‌ విజన్‌ అద్భుతం

  • రేవంత్‌కు అధిష్ఠానం ప్రశంసలు.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి సీఎం నివాళి

న్యూఢిల్లీ, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌, విజన్‌ అద్భుతంగా ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ అధిష్ఠానం అభినందించింది. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌.. ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని వారి నివాసాల్లో గురువారం స్వయంగా కలిశారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ విశేషాలను వారికి వివరించారు. సమ్మిట్‌ విజయవంతం కావడం, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రాబట్టేందుకు ఒప్పందాలు చేసుకోవడంపై రేవంత్‌ రెడ్డిని ఖర్గే, ప్రియాంక అభినందించారు. సీఎం వెంట మంత్రి వివేక్‌ వెంకటస్వామి, ఎంపీలు మల్లు రవి, రఘువీర్‌ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, సురేశ్‌ షెట్కార్‌, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పోరిక బలరాం నాయక్‌ ఉన్నారు. తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు ట్రంప్‌ ప్రతినిధి రావడంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని సీనియర్‌ జర్నలిస్టు శేఖర్‌ గుప్తాతోపాటు పలువురు ప్రముఖులు అభినందించారు. ఇక, పార్టీ అగ్రనేతలతో భేటీ అనంతరం పార్లమెంట్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి సుమారు గంట సేపు అక్కడ గడిపారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతమైన నేపథ్యంలో కాంగ్రె్‌సతోపాటు ఇతర పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సీఎం రేవంత్‌ హైదరాబాద్‌ తిరుగు ప్రయాణమయ్యారు. ఇక, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని తన నివాసంలో ప్రణబ్‌ ముఖర్జీ చిత్రపటానికి సీఎం రేవంత్‌ గురువారం నివాళులర్పించారు. దేశాభివృద్ధిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పాత్ర కీలకమని, ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

మెస్సీ మ్యాచ్‌కు రాహుల్‌, ప్రియాంకను ఆహ్వానించా: సీఎం రేవంత్‌ రెడ్డి

ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్‌ వస్తున్నారని, ఆ కార్యక్రమానికి హాజరు కావాలని రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించానని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌ పార్లమెంట్‌లో కొద్దిసేపు విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘ఈనెల 13న మెస్సీ హైదరాబాద్‌ వస్తున్నారు. ఒక ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరవుతున్నారు. ముఖ్యమంత్రిగా నేను కూడా ఒక అతిథిగా ఆ కార్యక్రమానికి వెళుతున్నాను. అంతేతప్ప.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కార్యక్రమంతో ఎటువంటి సంబంధం లేదు. మెస్సీ ఒక ప్రముఖ క్రీడాకారుడు కాబట్టి.. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తున్నాం. మెస్సీ హాజరయ్యే కార్యక్రమానికి రావాలని రాహుల్‌, ప్రియాంక గాంధీలను కోరాను’’ అని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - Dec 12 , 2025 | 05:02 AM