CM Revanth Reddy Plays Friendly Football: వోక్సెన్‌లో సీఎం రేవంత్ కిక్
ABN , Publish Date - Dec 12 , 2025 | 05:00 AM
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీతో పోరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగానే సిద్ధమవుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా మైదానంలోకి దిగి సాధన చేస్తున్నారు.....
సంగారెడ్డి జిల్లా కంకోల్‌లోని వోక్సెన్ వర్సిటీని సందర్శించిన సీఎం
వర్సిటీ జట్టుతో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, మునిపల్లి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీతో పోరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగానే సిద్ధమవుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా మైదానంలోకి దిగి సాధన చేస్తున్నారు. న్యూఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. సంగారెడ్డి జిల్లా కంకోల్ గ్రామ శివారులోని వోక్సెన్ యూనివర్సిటీని గురువారం సాయంత్రం సందర్శించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో కలిసి వర్సిటీకి వెళ్లిన సీఎం రేవంత్.. తొలుత వర్సిటీ ప్రాంగణాన్ని పరిశీలించారు. అలాగే విద్యార్థులు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను సందర్శించి వారిని అభినందించారు. అనంతరం వర్సిటీకి చెందిన వోక్సెన్ షార్క్స్ జట్టుతో జరిగిన ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో బరిలోకి దిగారు. ఆటలో భాగంగా సీఎం రేవంత్ కొట్టిన కిక్‌లు, చేసిన పాస్‌లకు విద్యార్థులు కేరింతలు కొట్టారు. అంతకముందు వోక్సెన్ యూనివర్సిటీ చాన్సలర్ ప్రవీణ్ కె పులా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు.
మెస్సీ, రేవంత్ మ్యాచ్‌కు పటిష్ట భద్రత
సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఉప్పల్ స్టేడియంలో 13వ తేదీన జరిగే మ్యాచ్‌కు పటిష్టమైన భద్రత కల్పించాలని డీజీపీ శివధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయకుమార్ ఇతర సీనియర్ అధికారులతో కలిసి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియాన్ని డీజీపీ గురువారం సందర్శించారు. స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ.. జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖ, వాటర్ వర్క్స్, స్పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ తెలంగాణకు చెందిన అధికారులతో పాటు మ్యాచ్ నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. మెస్సీకి ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని భద్రతా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. కాగా, పాస్‌లు, టిక్కెట్లు ఉన్న వారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తామని, స్టేడియానికి చేరుకునే మార్గాల్లోనే పాస్‌లు, టికెట్ల పరిశీలన చేపడతామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు వివరించారు.