CM Revanth Reddy Orders: వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ
ABN , Publish Date - Sep 16 , 2025 | 05:18 AM
వ్యాప్తంగా ఎల్‌ఈడీ వీధి దీపాల పర్యవేక్షణ పక్కాగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలనే ఏర్పాటు చేయాలని సూచించారు...
రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌ఈడీ దీపాలే ఉండాలి
గ్రామాల్లో నిర్వహణ బాధ్యత సర్పంచ్‌లదే
ఎంపీడీవోల పర్యవేక్షణలో డ్యాష్‌బోర్డు
అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఈడీ వీధి దీపాల పర్యవేక్షణ పక్కాగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలనే ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పంచాయతీరాజ్, పురపాలకశాఖ అధికారులతో సోమవారం సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల పరిధిలో 16.16లక్షల ఎల్‌ఈడీ దీపాలు ఉన్నాయని, వరంగల్, నల్లగొండ, జనగామ, నారాయణపేట జిల్లాల్లో ఏజెన్సీల ఆధ్వర్యంలో ఎల్‌ఈడీ దీపాల నిర్వహణ ఉందని అధికారులు వివరించారు. ఇక, జీహెచ్‌ఎంసీ పరిధిలో 5.50లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలున్నాయని, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ సిటీలో కొత్తగా 7.50లక్షల దీపాలు అవసరమవుతాయని వెల్లడించారు. గతంలో ఉన్న ఏజెన్సీ కాంట్రాక్టు ముగియడంతో ఇప్పుడు చాలాచోట్ల దీపాలు వెలగడం లేదని, నిర్వహణ కూడా సరిగా లేదని నివేదించారు. ఆయా అంశాలపై సీఎం స్పందిస్తూ.. గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణను సర్పంచ్‌లకే అప్పగించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న దీపాలు వెలుగుతున్నాయా? లేదా? కొత్తగా ఎన్ని అవసరం? అనే అంచనాలు పక్కాగా ఉండాలని, పోల్ సర్వే చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాల డ్యాష్ బోర్డును ఎంపీడీవోలు, జిల్లా స్థాయిలో అడిషనల్ కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ఎల్‌ఈడీ దీపాలను హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి అనుసంధానం చేయాలన్నారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా కలిపిన కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, గ్రామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఎల్‌ఈడీ దీపాల అవసరాన్ని అంచనా వేయాలని ఆదేశించారు. కొత్తగా ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటుకు టెండర్లు పిలవాలని, ఎల్‌ఈడీ దీపాల తయారీలో పేరున్న సంస్థలు పాల్గొనేలా నిబంధనలు రూపొందించాలని సూచించారు. ఏడేళ్లపాటు నిర్వహణ బాధ్యతలను కంపెనీలకే అప్పగించాలని, నిర్వహణ పక్కాగా ఉండేలా టెండర్ నిబంధనలు రూపొందించుకోవాలన్నారు. ఎల్‌ఈడీ దీపాలు పని చేస్తున్నాయా? లేదా? అనేది తెలుసుకోవడానికి ప్రత్యేకంగా వ్యవస్థ ఉండాలని నిర్దేశించారు. ఐఐటీ హైదరాబాద్ వంటి సంస్థతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని సూచించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో వీధి దీపాలకు ప్రతి నెలా రూ.8 కోట్ల కరెంటు బిల్లులు చెల్లించాల్సి వస్తోందని, దీన్ని తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. సౌర విద్యుత్తును వినియోగించే అంశాన్ని పరిశీలించాలన్నారు.