Share News

CM Revanth Reddy: మొంథాతో జాగ్రత్త!

ABN , Publish Date - Oct 30 , 2025 | 04:57 AM

మొంథా తుఫాన్‌తో రైతులు నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వరికోతల సమయమైనందున..

CM Revanth Reddy: మొంథాతో జాగ్రత్త!

  • అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. రైతాంగం నష్టపోకుండా చూడాలి

  • అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

  • జనజీవనానికి ఆటంకం లేకుండా చూడండి

  • విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, అక్టోబరు 29 (ఆంధ్ర జ్యోతి): మొంథా తుఫాన్‌తో రైతులు నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వరికోతల సమయమైనందున.. పలుచోట్ల రైతులు ధాన్యం ఆరబోశారని, వారికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రంలో తుఫాన్‌ తీవ్రతపై బుధవారం సీఎం ఆరా తీశారు. హైదరాబాద్‌ సహా ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ జిల్లాల్లో తుఫాన్‌ తీవ్రత అధికంగా ఉందని, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలు సమన్వయం చేసుకోవాలని, కలెక్టర్లు ఆయా బృందాలకు తగిన మార్గదర్శకత్వం వహించాలని అన్నారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంతాల్లో నివాసముండే కుటుంబాలను సహాయ శిబిరాలకు తరలించాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు జలాశయాలు, చెరువులు, కుంటల్లో నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కలెక్టర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం..

తుఫాన్‌ ప్రభావంతో వర్షపునీరు నిల్వ ఉండి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు పారిశుధ్య పనులు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం, పశు సంపద కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలన్నారు. కాగా, రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్‌, యాదాద్రి భువనగిరి, మెదక్‌, మేడ్చల్‌, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. మొంథా తుఫాన్‌ నేపథ్యంలో బుధవారం విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితిపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Oct 30 , 2025 | 06:23 AM