CM Revanth Reddy Meets MLAs: పార్టీ మారిన ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం!
ABN , Publish Date - Sep 08 , 2025 | 02:54 AM
బీఆర్‌ఎస్ పార్టీ అనర్హత పిటిషన్‌కు సంబంధించి స్పీకర్ ప్రసాద్‌కుమార్ నుంచి నోటీసులందుకున్న ఎమ్మెల్యేలు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీకి..
స్పీకర్ నోటీసులందుకున్న ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ భేటీ
కృష్ణమోహన్‌రెడ్డి సహా 9 మంది హాజరు
జ్వరం కారణంగా రాలేకపోయిన కడియం శ్రీహరి
అనర్హత పిటిషన్ విచారణపై న్యాయనిపుణులతో సమీక్ష
నియోజకవర్గాల సమస్యలపై ముఖ్యమంత్రి ఆరా
పరిష్కారానికి నిధులిస్తామని ఎమ్మెల్యేలకు రేవంత్‌రెడ్డి హామీ
సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి
హైదరాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పార్టీ అనర్హత పిటిషన్‌కు సంబంధించి స్పీకర్ ప్రసాద్‌కుమార్ నుంచి నోటీసులందుకున్న ఎమ్మెల్యేలు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీకి.. కడియం శ్రీహరి మినహా 9మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జ్వరం కారణంగా ఆయన ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు. అయితే తాను పార్టీ మారలేదంటూ పలుమార్లు ప్రకటించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఈ భేటీకి హాజరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పలువురు న్యాయనిపుణులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పది మంది ఎమ్మెల్యేల అనర్హత కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, స్పీకర్ నోటీసుల జారీ, ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణ తదితర అంశాలపై న్యాయ నిపుణులతో సమీక్షించారు. అయితే ఇప్పటివరకు వివరణ ఇచ్చిన ఎమ్మెల్యేలు.. తాము పార్టీ మారలేదని, నియోజకవర్గ అభివృద్ధికి నిధులడిగేందుకు ముఖ్యమంత్రిని ఇతర ఎమ్మెల్యేలు కలిసినట్లుగానే తామూ కలిశామని చెప్పినట్లు సమాచారం. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డిని ఇప్పటిదాకా వంద మందికి పైగా ఎమ్మెల్యేలు కలిశారని వివరించినట్లు తెలుస్తోంది. కాగా, అనర్హత కేసు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, పిటిషన్‌దారుల సమక్షంలో ఈ కేసు విచారణ ప్రక్రియను స్పీకర్ ప్రసాద్‌కుమార్ చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విచారణను ఎమ్మెల్యేలు ఎలా ఎదుర్కొనాలన్నదానిపై న్యాయ నిపుణులతో కొంత చర్చ జరిగింది. ఎమ్మెల్యేలతో భేటీలో వారి నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపైనే సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కువగా చర్చించినట్లు తెలుస్తోంది. భేటీలో పాల్గొన్న 9మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఏయే అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్‌లో ఉన్నాయి, వాటిలో తక్షణం పూర్తి చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయన్న దానిపై సీఎం ఆరా తీశారు. వాటికి తక్షణమే నిధులు మంజూరు చేస్తామమని హామీ ఇచ్చారు. అలాగే ఆయా ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఎదుర్కొంటున్న సమస్యలు, సాధక బాధకాలనూ అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి అన్ని విధాలుగా సహకరిస్తానని భరోసా ఇచ్చారు.