Share News

CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం

ABN , Publish Date - Sep 08 , 2025 | 02:52 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన కలల ప్రాజెక్టుగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ పనులకు సోమవారం శ్రీకారం చుట్టనున్నారు..

CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం

  • రూ,7,658 కోట్లతో గోదావరి తాగునీటి ప్రాజెక్టు ఫేజ్‌-2, 3 పథకాలకు నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి

  • మల్లన్నసాగర్‌ నుంచి 20 టీఎంసీల నీటి తరలింపు

  • మూసీకి 2.5.. హైదరాబాద్‌ తాగునీటికి 17.5 టీఎంసీలు

  • ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-2 తాగునీటి సరఫరానూ ప్రారంభించనున్న సీఎం

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన కలల ప్రాజెక్టుగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ పనులకు సోమవారం శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా రూ.7,360 కోట్లతో ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ చెరువులను మంచినీటితో నింపేందుకు ఉద్దేశించిన గోదావరి తాగునీటి ప్రాజెక్టు ఫేజ్‌-2, 3 పథకాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దీంతోపాటు ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-2లోని ప్రాంతాలకు తాగునీటి స రఫరా కోసం చేపట్టిన ప్రాజెక్టులో నిర్మించిన 15 కొత్త రిజర్మాయర్లను ప్రారంభించనున్నారు. కాగా, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌ (హ్యామ్‌) విధానంలో చేపడుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 40 శాతం పెట్టుబడి పెట్టనుండగా, కాంట్రాక్టు సంస్థ 60 శాతం నిధులను సమకూర్చుకోనుంది. పనులు ప్రారంభమైన తరువాత నుంచి రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి 20 టీఎంసీల నీటిని తరలిస్తారు. వీటిలో మూసీ పునరుజ్జీవానికి 2.5 టీఎంసీల నీటిని కేటాయించి.. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాలను నింపనున్నారు. మిగతా 17.5 టీఎంసీలను హైదరాబాద్‌ ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. నీటి తరలింపు మార్గం మధ్యలో ఉన్న 7 చెరువులను కూడా నింపుతారు. 2027 డిసెంబరు నాటికి హైదరాబాద్‌ తాగునీటి అవసరాలు తీర్చేందుకు, ప్రతిరోజూ నల్లా నీటిని సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టును ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది.

15 రిజర్వాయర్ల ప్రారంభం..

ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-2లో భాగంగా జీహెచ్‌ఎంసీ, ఓఆర్‌ఆర్‌ పరిధిలోని మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్లు, గ్రామపంచాయతీలకు తాగునీటి సరఫరా కోసం రూ.1,200 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయింది. ఈ ప్రాజెక్టులో మొత్తం 71 రిజర్వాయర్లను నిర్మించగా.. వీటిలో 15 కొత్త రిజర్వాయర్లను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. వీటి ద్వారా సరూర్‌నగర్‌, మహేశ్వరం, శంషాబాద్‌, హయత్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్‌, కీసర, రాజేంద్రనగర్‌, షామీర్‌పేట, మేడ్చల్‌, కుత్భుల్లాపూర్‌, ఆర్‌సీ పురం, పటాన్‌చెరు, బొల్లారం సహా 14 మండల్లాల్లోని 25 లక్షల మందికి తాగునీరు అందనుంది. మరోవైపు కోకాపేట లేఅవుట్‌ సమగ్ర అభివృద్ధిలో భాగంగా నియోపోలిస్‌ సెజ్‌కు తాగునీరు, మురుగునీటి వ్యవస్థ అభివృద్ధి కోసం రూ.298 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుకు సీఎం రేవంత్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిద్వారా దాదాపు 13 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.

Updated Date - Sep 08 , 2025 | 02:52 AM