Share News

CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌

ABN , Publish Date - Oct 25 , 2025 | 05:14 AM

సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ఉదయం ఢిల్లీకి వెళ్తున్నారు. జిల్లా.. పట్టణ కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఏఐసీసీ...

CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌

  • డీసీసీ అధ్యక్షుల ఎంపిక కసరత్తులో పాల్గొనేందుకే.. నెలాఖరుకల్లా కొత్త డీసీసీ అధ్యక్షుల ప్రకటన!

  • జూబ్లీహిల్స్‌లో సీఎం ఆకస్మిక పర్యటన

  • పార్కు పనుల పరిశీలన.. కూలీలతో మాటామంతీ

  • ముఖ్యమంత్రితో కమ్మ సంఘాల సమాఖ్య ప్రతినిధుల భేటీ

హైదరాబాద్‌/జూబ్లీహిల్స్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ఉదయం ఢిల్లీకి వెళ్తున్నారు. జిల్లా.. పట్టణ కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఏఐసీసీ కార్యాలయంలో జరిగే తుది కసరత్తులో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి పాల్గొంటారు. జిల్లా, పట్టణ కాంగ్రెస్‌ కమిటీలకు అధ్యక్షుల ఎంపికకు సంబంధించి ఇటీవల జిల్లా పర్యటనలు చేసిన ఏఐసీసీ పరిశీలకులు.. వర్గాల వారీగా ఒక్కో కమిటీకి ఆరుగురితో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. వాటిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానున్న సీఎం రేవంత్‌, భట్టి, మహేశ్‌ గౌడ్‌, మీనాక్షి, ఉత్తమ్‌.. తమ అభిప్రాయాలు వినిపించనున్నారు. ఈ భేటీలో 39 జిల్లాలతో పాటు పట్టణ కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ఒక కొలిక్కి రానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆమోద ముద్ర తర్వాత ఈ నెలాఖరుకు లేదా నవంబర్‌ మొదటి వారంలో ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్‌ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆకస్మికంగా పర్యటించారు. శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 45లో నిర్మాణంలో ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కు పనులను పరిశీలించారు. హైదరాబాద్‌లో పలు వివాహాలకు హాజరై వస్తున్న సందర్భంగా మార్గమధ్యలో నిర్మాణంలో ఉన్న పార్కు దగ్గర ఆగి పనులను తనిఖీ చేశారు. అక్కడి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సీఎంను కలిసిన పంజాబ్‌ మంత్రులు..

సీఎం రేవంత్‌ను పంజాబ్‌ రాష్ట్ర మంత్రులు సంజీవ్‌ అరోరా, గుర్మీత్‌ సింగ్‌ ఖుడియన్‌లు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పంజాబ్‌లో జరిగే 350వ ‘గురు పురబ్‌’ ఉత్సవానికి హాజరవ్వాలంటూ ఆహ్వానించారు. ఇటు తెలంగాణ రాష్ట్ర కమ్మ సంఘాల సమాఖ్య ప్రతినిధులు కూడా సీఎంను కలిశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కమ్మ సంఘాల సమాఖ్య గౌరవ సలహాదారులు కలగర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌ను సన్మానించారు. కమ్మ సామాజికవర్గంలోని పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు రాష్ట్ర కమ్మ సమాఖ్య తరఫున తమ మద్దతు ప్రకటించారు. సినీ నటుడు నారా రోహిత్‌ సీఎంను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ నెల 30న తన వివాహానికి హాజరవ్వాలని కోరుతూ ఆహ్వాన పత్రిక అందించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ రఘువీర్‌ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 05:14 AM