CM Revanth Reddy: నియంతలను తరిమికొట్టిన కళాకారులు
ABN , Publish Date - Nov 23 , 2025 | 05:12 AM
పాలకులు ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడల్లా తెలంగాణ గడ్డమీద పుట్టిన కవులు, కళాకారులు గొంగడి దులిపి, గజ్జకట్టి గళాన్ని సవరించి పోరాటంలోకి దుమికి నియంతలను...
అదే కోవకు చెందిన గొప్ప కవి అందెశ్రీ
‘జయ జయహే’ గీతంపై గత సర్కారు కుట్ర
కళాకారుల పోరాటం వల్లే రాష్ట్రం వచ్చిందన్న
భావన నెలకొంటుందనే గీతాన్ని తొక్కిపెట్టారు
రాష్ట్రంలో దళితుల జనాభా 17ు ఉంటే 27శాతం ప్రాతినిధ్యం కల్పించిన ఘనత మా సర్కారుది
అందెశ్రీ సంస్మరణ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): పాలకులు ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడల్లా తెలంగాణ గడ్డమీద పుట్టిన కవులు, కళాకారులు గొంగడి దులిపి, గజ్జకట్టి గళాన్ని సవరించి పోరాటంలోకి దుమికి నియంతలను తరిమికొడతారని చరిత్ర చెబుతోందని.. అలాంటి స్ఫూర్తిదాయకమైన సాహితీవేత్తల్లో ఒకరు అందెశ్రీ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘కవి రాసే పెన్నుల మీద మన్నుగప్పితే ఆ పెన్నులు గన్నులై మొలకెత్తి గడీలను కుప్పకూలుస్తాయి’ అన్న నినాదాన్ని నిజం చేసినవారు అందెశ్రీ అని కొనియాడారు. కవులు, కళాకారుల్లో అందెశ్రీ కోహినూర్ లాంటివారని అభివర్ణించారు. తనకు ఆయన ఎంతో ఆప్తులని, మనసుకు దగ్గరివారని భావోద్వేగంతో చెప్పారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సారథ్యంలో శనివారం రవీంద్రభారతిలో జరిగిన తెలంగాణ రాష్ట్రగీత రచయిత అందెశ్రీ సంస్మరణసభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరయ్యారు. అందెశ్రీ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు ప్రేరణగా నిలిచిన అందెశ్రీ రాసిన ‘జయజయహే తెలంగాణ’ గీతం గత పాలకుల నిర్ణయాల వల్ల అప్పట్లో మూగబోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గీతం తెలంగాణ గుండెల్లో ప్రతిధ్వనించినంత కాలం గద్దర్, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయరాజ్ త దితర కవులు, కళాకారుల పోరాటం వల్లే రాష్ట్రం సిద్ధించిందన్న భావన నెలకొంటుందనే నాటి సర్కా రు కుట్ర చేసిందని ఆరోపించారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు కోట్ల ప్రజ లు కోరుకున్న ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్రగీతంగా ప్రకటించిందని పేర్కొన్నారు. అందెశ్రీ కుటుంబాన్ని ఆదుకోవడం తన బాధ్యత అని.. అందులో భాగంగా ఆ కుటుంబంలో ఒకరికి ప్రభు త్వ ఉద్యోగం ఇచ్చామని చెప్పారు. ప్రజా ప్రభుత్వం తొలి వార్షికోత్సవం సందదర్భంగా తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన అందెశ్రీ సహా తొమ్మిదిమంది ఉద్యమకారులకు రూ.కోటి నగదు పురస్కారంతో పాటు ఒక్కొక్కరికి 300గజాల ఇంటి స్థలం ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ తొమ్మిది మంది ఉద్యమకారుల కుటుంబసభ్యులు ఆత్మగౌరవంతో జీవించేలా భారత్ ఫ్యూచర్ సిటీలో వారికి అద్భుతమైన ఇళ్లను నిర్మించి ఇస్తామని, ఆ బాధ్యతను మంత్రి దామోదరకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తనకు దళితుల సమస్యల మీద అవగాహన ఉంది అని రేవంత్ అన్నారు. ‘‘మా గ్రామ దళితులు అండగా నిలవడం వల్లే మోతుబరి రైతులుగా సమాజంలో మేము గుర్తింపు పొందగలిగాం. ఇప్పుడు మీరంతా ఆశీర్వదించారు కాబట్టే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాను’’ అని సభకు హాజరైన దళితులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ముగ్గురుంటే, నలుగురు దళితులున్నారని, స్పీకరు కూడా అదే సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి అని గుర్తుచేశారు. రాష్ట్రంలో 17శాతం దళిత జనాభా ఉంటే 27శాతం మేర ప్రాతినిధ్యం కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. కాగా ఎస్సీ వర్గీకరణ అమలుచేసిన ముఖ్యమంత్రిగా రేవంత్ చరిత్రలో నిలుస్తారని మాజీ మంత్రి మోత్కుపల్లి పేర్కొన్నారు.