CM Revanth Reddy: భవిష్యత్తుకు బ్రాండింగ్
ABN , Publish Date - Nov 26 , 2025 | 04:43 AM
అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సులో బ్రాండింగ్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్దేశించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో విభాగాల వారీగా చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతి అంశం కూడా ప్రచారంలో ప్రముఖంగా ఉండేలా చూడాలని సూచించారు.....
అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు ప్రచారం ఉండాలి
తెలంగాణ గతం, వర్తమానం, భవిష్యత్‌లను ప్రతిబింబించాలి
మన కళలు, ప్రముఖులను ప్రచారంలో వినియోగించాలి
ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ నిలిచేలా ‘తెలంగాణ రైజింగ్’ గ్లోబల్ సదస్సులో బ్రాండింగ్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్దేశించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో విభాగాల వారీగా చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతి అంశం కూడా ప్రచారంలో ప్రముఖంగా ఉండేలా చూడాలని సూచించారు. పెట్టుబడిదారులకు రాష్ట్రం కల్పించే సదుపాయాలను సమగ్రంగా వివరించాలని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. భారత్ ఫ్యూచర్ సిటీలో వచ్చే నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సును నిర్వహించనున్న విషయం తెలిసిందే. దేశ, విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర రంగాల ప్రముఖులు పాల్గొననున్న నేపథ్యంలో.. సదస్సుకు బ్రాండింగ్ చేయడంపై సీఎం మంగళవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. వివిధ సంస్థలు రూపొందించిన ప్రచార చిత్రాలు, వీడియోలను వీక్షించి పలు మార్పులు, చేర్పులు సూచించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. భారత్ ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి పనులు, సదుపాయాలను పెట్టుబడిదారులకు సమగ్రంగా వివరించాలని సూచించారు. హైదరాబాద్‌కు అనుకూల అంశాలైన ఇన్నర్ రింగు రోడ్డు, ఔటర్ రింగు రోడ్డు, రానున్న రీజనల్ రింగు రోడ్డు, బందరు పోర్టుకు గ్రీన్‌ఫీల్డ్ హైవే, రైలు మార్గం, డ్రైపోర్ట్‌తోపాటు తెలంగాణలోని కళా, సాంస్కృతిక, భాష, వాతావరణ అనుకూలతలను వివరించాలని నిర్దేశించారు. రాష్ట్రంలో 1999 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా విధానపరమైన నిర్ణయాల్లో ఎటువంటి మార్పులేని అంశాన్ని, పెట్టుబడుల విషయంలో మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని ప్రత్యేకంగా వివరించాలని సూచించారు.
మన ప్రత్యేకతలను వివరించాలి
తెలంగాణ బ్రాండింగ్‌కు సంబంధించి మన రాష్ట్రానికే పరిమితమైన, వైవిధ్యమైన ప్రత్యేకతలను చేర్చాలని సమీక్షలో సీఎం సూచించారు. రామప్ప నంది, సమ్మక్క సారక్క జాతర, నల్లమల పులులు, మహబూబ్‌నగర్ జిల్లాకే ప్రత్యేకమైన ఎద్దులు, తెలంగాణ నుంచి జాతీయ రాజకీయాలను శాసించిన పీవీ వంటి ప్రముఖులు, కళాకారులు, క్రీడాకారులు, అంతర్జాతీయ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న ప్రముఖులు ఇలా ప్రతి అంశానికి బ్రాండింగ్‌లో చోటు కల్పించాలని చెప్పారు. పత్రికలు, చానళ్లు, డిజిటల్ వేదికలను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. సమీక్షలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వివిధ అంశాలపై వరుసగా సమీక్షలు..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు ఏర్పాట్లు, నిర్వహణ, ఇతర అంశాలపై సీఎం ప్రతిరోజూ సమీక్ష నిర్వహించనున్నారు. బుధవారం రవాణా ఏర్పాట్లపై మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష ఉంటుంది. 27న సదస్సు కోసం కల్పించే మౌలిక వసతులపై మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, సీతక్క, అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. 28న సాయంత్రం 4 గంటలకు విద్య, యువజన సంక్షేమంపై మంత్రులు వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, అధికారులతో.. సాయంత్రం 6 గంటలకు పర్యాటకం, టెంపుల్ టూరిజంపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖలతో సమీక్షిస్తారు. 29న సాయంత్రం 4 గంటలకు వ్యవసాయం, సంక్షేమ విభాగాలపై మంత్రులు తుమ్మల, ఉత్తమ్, వాకిటి శ్రీహరి, సంబంధిత అధికారులతో.. సాయంత్రం 6 గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, అజారుద్దీన్‌లతో సమావేశాలు నిర్వహిస్తారు. 30న ఆరోగ్య రంగంపై మంత్రి రాజనర్సింహ, అధికారులతో సమీక్షిస్తారు.