Share News

CM Revanth Reddy: సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి

ABN , Publish Date - Oct 14 , 2025 | 03:06 AM

సంక్షేమ శాఖల వసతి గృహాల్లో అత్యవసర పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.60 కోట్లు కేటాయించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వసతి గృహాల్లో డైట్‌ చార్జీలు...

CM Revanth Reddy: సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి

  • విద్యార్థులకు అందే సేవలకు యాప్‌లు

  • వసతి గృహాల నిర్వహణకు రూ.60 కోట్లు

  • విద్యార్థులు, ఉద్యోగులకు బయోమెట్రిక్‌

  • ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ శాఖల వసతి గృహాల్లో అత్యవసర పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.60 కోట్లు కేటాయించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వసతి గృహాల్లో డైట్‌ చార్జీలు, తాత్కాలిక సిబ్బంది జీతాల విడుదల, మోటార్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులకు వినియోగించుకునేందుకు గాను ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి ఈ నిధులు సమకూర్చింది. హాస్టళ్లకు కేటాయించిన ఈ నిధులకు సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఆయా శాఖల సీనియర్‌ అధికారులకు అందజేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు, విద్యా సంస్థలపై సీఎం రేవంత్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది ముఖ గుర్తింపున (ఫేషియల్‌ రికగ్నిషన్‌)కు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పూర్తి స్థాయి సమాచారంతోపాటు జవాబుదారీతనం ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతను తెలుసుకునేందుకు యాప్‌ను ఉపయోగించాలని సూచించారు. సరైన పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

హాస్టళ్ల నిర్వహణ సమాచారం డాష్‌బోర్టులో..

హాస్టల్‌ విద్యార్థులకు అందించే యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో సక్రమంగా అందేలా సీనియర్‌ అధికారులు చూసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. హాస్టళ్లలోని సౌకర్యాలు, వాటి నిర్వహణపై పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాష్‌బోర్డ్‌లో అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులను హాస్టళ్లతో అనుసంధానించాలని చెప్పారు. హాస్టళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించాలని, అత్యవసర సమయాల్లో వైద్యులు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తరచూ హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు మెరుగైన సేవలు అందేలా చూడాలని ఆదేశించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లకు స్కాలర్‌షి్‌పలు, సిబ్బంది జీతాలు, డైట్‌ చార్జీలు, నిర్మాణ, ఇతర ఖర్చులు, బకాయిల చెల్లింపు, హాస్టళ్ల నిర్వహణకయ్యే నెలవారీ ఖర్చులు, బకాయిల చెల్లింపునకు అవసరమైన మొత్తానికి సంబంధించిన ప్రణాళికను సమర్పించాలని సీఎస్‌ రామకృష్ణారావు, సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్‌లకు సీఎం సూచించారు. హాస్టళ్ల కోసం కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధులను సమీకరించాలని, వాటికి అవసరమైన రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్‌ గ్రాంట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. 24 గంటలూ ఆన్‌లైన్‌లో వైద్యులు అందుబాటులో ఉండేలా హాట్‌లైన్‌ ఏర్పాటు చేయాలన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి ఎడ్‌టెక్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. హాస్టల్‌ విద్యార్థులకు అందించే సేవలను సోషల్‌ మీడియా ద్వారా తెలియజేయాలని, ఉద్దేశపూర్వకంగా చేసే తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని చెప్పారు. వీటన్నింటికీ అవసరమైన యాప్‌లను రూపొందించాలన్నారు. సమీక్షకు ముందు సవ్యసాచి ఘోష్‌ హాస్టళ్లలోని పరిస్థితులపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

Updated Date - Oct 14 , 2025 | 03:06 AM