CM Revanth Reddy: యుద్ధప్రాతిపదికన చేవెళ్ల, మన్నెగూడ రహదారి విస్తరణ
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:15 AM
హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు...
పనులు సకాలంలో పూర్తవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
మర్రిచెట్ల కేసు ఉపసంహరించుకున్న పర్యావరణవేత్తలకు సన్మానం
954 మర్రిచెట్ల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం హామీ
చేవెళ్ల, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోలీసు అకాడమీ నుంచి చేవెళ్ల, మన్నెగూడ వరకు రహదారి విస్తరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చెయ్యాలని సూచించారు. ఈ హైవే విస్తరణలో భాగంగా 954మర్రిచెట్లను తొలగించకుండా సంరక్షించాలని కోరు తూ ‘సేవ్ బనియన్స్’ సంస్థ గతంలో గ్రీన్ ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేసి ఇటీవల ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో సేవ్ బనియన్స్ ప్రతినిధులు బలంత్రాపు తేజ, పలువురు పర్యావరణవేత్తలు.. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం కలిశారు. కేసు ఉపసంహరించుకున్న పర్యావరణవేత్తలను సీఎం ఈ సందర్భంగా సత్కరించారు. సేవ్ బనియన్స్ సంస్థ పర్యావరణ వేత్తలు తయారు చేసిన టీషర్టును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. 954 మర్రిచెట్లను సంరక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. చెట్లకు నష్టం జరగకుం డా చూస్తామని, పర్యావరణవేత్తలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రహదారి పనుల్లో జాప్యం జరిగి, ఆ రోడ్డు ప్రాణాంతకంగా మారిందని, ఆ మార్గంలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం అందరినీ కలిచివేసిందని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎన్‌హెచ్‌ఏ అధికారులు పాల్గొన్నారు.