Share News

CM Revanth Reddy: బాసర నుంచి భద్రాచలం వరకూ.. శాశ్వత ఘాట్లు

ABN , Publish Date - Sep 13 , 2025 | 04:59 AM

గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభ మేళాగా నిర్వహించాలి. పరీవాహకంలోని 74 ఆలయాల్లోనూ పుష్కరాల నిర్వహణకు శాశ్వత ఏర్పాట్లు....

CM Revanth Reddy: బాసర నుంచి భద్రాచలం వరకూ.. శాశ్వత ఘాట్లు

  • రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలూ శాశ్వత ప్రాతిపదికనే..

  • దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు నిర్వహిద్దాం

  • ప్రధాన ఆలయాలు, అక్కడి ఘాట్ల అభివృద్ధికి తొలి ప్రాధాన్యం

  • గోదావరి పుష్కరాలపై సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్‌ నిర్దేశం

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘‘గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభ మేళాగా నిర్వహించాలి. పరీవాహకంలోని 74 ఆలయాల్లోనూ పుష్కరాల నిర్వహణకు శాశ్వత ఏర్పాట్లు చేయాలి. పుష్కర ఘాట్లను శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలి. అందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయండి’’ అని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రద్దీని అంచనా వేసుకొని పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నిర్దేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో శుక్రవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ‘‘2027లో జూలై 23వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఇప్పటి నుంచి 22 నెలల వ్యవధి ఉన్నందున శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించాలి. అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ధర్మపురి, కాళేశ్వరంతోపాటు అన్ని ప్రధాన ఆలయాలను మొదటగా అభివృద్ధి చేయాలి. ప్రధాన ఆలయాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అక్కడి పుష్కర ఘాట్ల అభివృద్ధిని తొలి ప్రాధాన్యంగా ఎంచుకోవాలి. ఆలయ అభివృద్ధితోపాటు శాశ్వత ఘాట్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. రెండో ప్రాధాన్యంగా పుష్కర స్నానాలకు వీలుగా ఉండే తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. ఒకేరోజు రెండు లక్షల మంది భక్తులు స్నానాలకు వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉండాలి’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్దేశించారు. రహదారుల నిర్మాణంతోపాటు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్‌, తాగునీరు, వసతి తదితర భక్తులకు అవసరమైన సదుపాయాలన్నీ ఉండేలా పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహకంలోని ఆలయాలన్నింటినీ క్షేత్రస్థాయిలో సందర్శించి, ఆలయ కమిటీలు, అధికారులతో చర్చించి.. అవసరమైన అభివృద్ధి పనుల జాబితాను తయారు చేయాలని చెప్పారు.


కేంద్రం నుంచి స్పెషల్‌ ప్యాకేజీ కోరేందుకు వీలుగా జాబితా

బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం తదితర ఆలయాలన్నింటినీ సందర్శించి విడివిడిగా ప్రాజెక్టు రిపోర్టులు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు. ప్రస్తుత పుష్కర ఘాట్లను విస్తరించడంతోపాటు రోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆలయాల అభివృద్ధికి డిజైన్లు రూపొందించాలన్నారు. పుష్కరాల ఏర్పాట్లకు కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, స్వచ్ఛ భారత్‌, జల్‌ జీవన్‌ మిషన్‌తోపాటు కేంద్ర పథకాలతో సమన్వయం ఉండే పనులను గుర్తించి, వాటికి అవసరమైన అనుమతులు తీసుకోవాలని నిర్దేశించారు. దక్షిణ భారత కుంభమేళాకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కేంద్రం నుంచి స్పెషల్‌ ప్యాకేజీ కోరేందుకు వీలుగా ఈ పనుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు. పుష్కరాల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా పర్యాటక, నీటి పారుదల, దేవాదాయ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమీక్షలో మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ధార్మిక సలహాదారు గోవింద హరి తదితరులు పాల్గొన్నారు.

సీఎం మేడారం పర్యటన రద్దు

ములుగు, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌ రెడ్డి ములుగు జిల్లా పర్యటన రద్దయింది. వాస్తవానికి సీఎం తాడ్వాయి మండలంలోని మేడారంలో జరుగుతున్న మహా జాతర పనులను శనివారం పర్యవేక్షించాల్సి ఉంది. కాగా, పర్యటన రద్దుకు గల కారణాలు అధికారికంగా వెల్లడి కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరుగుతున్న కాల్పులే కారణం కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికితోడు సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల మార్పుపై జరుగుతున్న వివాదం కూడా పర్యటన రద్దుకు ఒక కారణంగా భావిస్తున్నారు.

Updated Date - Sep 13 , 2025 | 04:59 AM