Share News

CM Revanth Reddy: టికెట్ల పెంపు ఆదాయంలో కార్మికులకు 20 శాతం

ABN , Publish Date - Oct 29 , 2025 | 04:37 AM

సినీ కార్మికులు తమ సంక్షేమం కోసం వెల్ఫేర్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: టికెట్ల పెంపు ఆదాయంలో కార్మికులకు 20 శాతం

  • అలాగైతేనే ధరల పెంపునకు అనుమతిస్తాం

  • సినీ కార్మికుల వెల్ఫేర్‌ ఫండ్‌కు రూ.10 కోట్లు ఇస్తాం

  • వారి పిల్లలకు కృష్ణానగర్‌లో కార్పొరేట్‌ స్థాయి స్కూల్‌

  • జబ్బు పడ్డ వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యం

  • భారత ఫ్యూచర్‌ సిటీలో ఫైటర్స్‌ ట్రైనింగ్‌ కోసం స్థలం

  • నవంబరు ఆఖర్లో సినీ కార్మికుల సమస్యలపై చర్చిస్తాం

  • ఏమేం చేయబోతున్నామో డిసెంబరు 9న ఆదేశాలిస్తాం

  • అందరూ అండగా ఉంటే హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తెస్తా

  • సినీ కార్మిక సంఘాల అభినందన సభలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): సినీ కార్మికులు తమ సంక్షేమం కోసం వెల్ఫేర్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ నిధికి రూ.10 కోట్లు ఇస్తామని తెలిపారు. ఆ ఫండ్‌ నుంచే కష్టాల్లో ఉండే కార్మికులను ఆదుకోవాలని సూచించారు. సినిమాలకు టికెట్ల ధరలు పెంచడం ద్వారా వచ్చే ఆదాయం నుంచి కూడా 20 శాతాన్ని కార్మికుల వెల్ఫేర్‌ ఫండ్‌కు ఇవ్వాలన్నారు. అలా ఇస్తేనే టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం జీవో ఇస్తుందని స్పష్టం చేశారు. దీంతోపాటు.. సినీ కార్మికుల పిల్లలకు కృష్ణానగర్‌లో కార్పొరేట్‌ స్థాయిలో పాఠశాల నిర్మిస్తామన్నారు. ఇందుకోసం మూడు, నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని చూడాలని అధికారులను ఆదేశించారు. భారత ఫ్యూచర్‌ సిటీలోనూ సినీ పరిశ్రమకు ప్రాధాన్యం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం సాయంత్రం సినీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో యూస్‌ఫగూడ పోలీస్‌ గ్రౌండ్‌లో సీఎం రేవంత్‌రెడ్డికి అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను ‘మదరాసి’ అని పిలిచేవారని, ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఈ పరిశ్రమను హైదరాబాద్‌కు తరలించడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి దిగ్గజ నటుల సహకారంతోనే పరిశ్రమ హైదరాబాద్‌లో స్థిరపడిందన్నారు.


కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే తక్కువ ధరకే భూములు ఇచ్చారని, చిత్రపురి కాలనీ అభివృద్థిలో నాటి నాయకుల కృషిని మరిచిపోకూడదని అన్నారు. నటుడు ప్రభాకర్‌ రెడ్డి సినీ కార్మికుల కోసం తన 10 ఎకరాల సొంత భూమిని ఇచ్చారని గుర్తు చేశారు. తెలుగు సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ.. ఆస్కార్‌ స్థాయికి ఎదుగుతోందంటే దానివెనుక నటులు, డైరెక్టర్లే కాకుండా సినీ కార్మికుల కష్టం, శ్రమ ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సినీ కార్మికుల శ్రమ తనకు తెలుసునని, అధికారంతో తన కళ్లు మూసుకుపోలేదని చెప్పారు. కృష్ణానగర్‌లో నిర్మించే స్కూల్లో సినీ కార్మికుల పిల్లలకు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కార్పొరేట్‌ స్థాయిలో ఉచితంగా చదువు చెప్పించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. వారికి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్నం లంచ్‌ కూడా పెట్టే ఏర్పాటు చేస్తామని తెలిపారు. సినీ కార్మికులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తామన్నారు. హాలీవుడ్‌ సినిమా షూటింగ్‌లు హైదరాబాద్‌లో జరగాలని, హైదరాబాద్‌ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు వేదిక కావాలన్నదే తన ఆలోచన అని తెలిపారు. పదేళ్లు ఆగిపోయిన నంది అవార్డుల స్థానంలో గద్దర్‌ అవార్డులను అందిస్తున్నామని గుర్తుచేశారు. సినీ పరిశ్రమను చిన్నచూపు చూసే ప్రసక్తే లేదని, ఐటీ, ఫార్మాలాగే సినీ పరిశ్రమకూ తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు. చిత్రపురి కాలనీ, ఫిలింనగర్‌, కృష్ణానగర్‌లాగే.. కొత్తగా నిర్మించుకుంటున్న భారత్‌ ప్యూచర్‌ సిటీలో సినీ రంగానికి పాత్ర ఉంటుందన్నారు.


కార్మికుల కష్టం వల్లే కనకవర్షం...

‘‘ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు, నిర్మాతలకు ఆదాయం వస్తుంది. కార్మికులకు ఒక్క రూపాయి కూడా రావడం లేదు. సినిమా నుంచి వచ్చే ఆదాయంలో 20 శాతం కార్మికులకు ఇస్తేనే ఇకపై జీవో ఇస్తాం. సినిమా గొప్పగా రాణిస్తుందన్నా, కనకవర్షం కురుస్తుందన్నా అది కార్మికుల భాగస్వామ్యతోనే. సినీ కార్మికులకు నిర్మాతలతో ప్రతిష్టంభన వచ్చినప్పుడు నిర్మాతల మండలిని పిలిచి.. కార్మికులు కష్టపడితేనే నిర్మాతలుగా నిలదొక్కుకుంటారని గుర్తు చేశాను. కార్మికులను కుటుంబ సభ్యులుగా చేసుకుంటేనే దర్శకులుగా, నిర్మాతలుగా రాణిస్తారని చెప్పాను. మీ కష్టాలను వంద శాతం తీర్చుతానని చెప్పడానికి నేను దేవుడిని కాదు. కానీ, వీలైనంత వరకు ప్రభుత్వం చేయగలిగిన పనులు తప్పకుండా చేస్తాను’’ అని సీఎం అన్నారు. సినీ కార్మికుల ఇళ్ల విషయంలో ఎలాంటి సహాయం చేయగలనో అంచనా వేసుకుంటానని తెలిపారు. కార్మికసంఘాల అసోసియేషన్‌ భవన్‌కు స్థలం కేటాయించి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇక భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో సినీ ఫైటర్స్‌ శిక్షణకు స్థలం కేటాయిస్తామని ప్రకటించారు. కార్మికులకు ఎప్పుడు ఆపద వచ్చినా తాను అండగా నిలబడతానన్నారు. ఇంకేమైనా సమస్యలుంటే నవంబరు చివరి వారంలో సంఘం నాయకులతో మరోసారి సమావేశమవుదామని, డిసెంబరు 9న సినీ కార్మికులకు ఏమేమి చేయబోతున్నామో ఆదేశాలిస్తామని చెప్పారు. అందరూ అండగా నిలబడితే హాలీవుడ్‌ను ఇక్కడికి తీసుకువచ్చే బాధ్యత తనదని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 29 , 2025 | 06:36 AM