CM Revanth Reddy Celebrates Dussehra: సొంతూరిలో దసరా వేడుకల్లో సీఎం
ABN , Publish Date - Oct 04 , 2025 | 03:43 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో గురువారం జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్నారు...
కొండారెడ్డిపల్లిలో రేవంత్‌కు ఘనస్వాగతం .. గ్రామస్థులతో కలిసి కాలినడకన జమ్మికి వెళ్లిన ముఖ్యమంత్రి
కల్వకుర్తి/వంగూరు/కొడంగల్/పరిగి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో గురువారం జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3:26 గంటలకు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో సీఎం తన కుటుంబ సభ్యులతో కలసి దిగారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, గ్రామస్థులు, కాంగ్రెస్ నాయకులు పూలవర్షం కురుపిస్తూ గజమాలతో ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ తమ ఇష్టదైవమైన ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి దర్శించుకున్నారు. అనంతరం తన నివాసానికి వెళ్లారు. సాయంత్రం 6:8 గంటలకు కోటమైసమ్మ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి కాలినడకన సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఆయన బంధువులు, గ్రామస్థులు డప్పు చప్పుళ్ల నడుమ గ్రామానికి కొద్ది దూరంలో ఏర్పాటు చేసిన జమ్మి చెట్టు వద్దకు చేరుకుని శమీపూజ చేశారు. ఆ తర్వాత గ్రామ పంచాయతీ సమీపంలో మహిళల బతుకమ్మ కార్యక్రమాన్ని తిలకించారు. అక్కడి నుంచి ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికలో గ్రామస్థులు, పార్టీ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డిని కలసి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపు సీఎం తన ఇంట్లో విశ్రాంతి తీసుకొని రాత్రి 8:20 గంటలకు ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గాన తన అసెంబ్లీ నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు వెళ్లారు. శుక్రవారం ఉదయం నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కొడంగల్‌కు తరలివచ్చారు. అందరికీ అభివాదం చేస్తూ సీఎం ముందుకు కదిలారు. కొడంగల్ పట్టణంలో టీపీసీసీ ప్రతినిధి ఎండీ.యూసుఫ్ నివాసంలో స్థానిక నేతలతో కలిసి భోజనం చేశారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్ వెళ్తున్న క్రమంలో పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలతో జనం నానా ఇబ్బందులు పడ్డారు.