Share News

Krishna Godavari Water Issues: సవాల్‌ మనమే విసిరాం... సిద్ధంగా ఉండండి!

ABN , Publish Date - Dec 30 , 2025 | 05:54 AM

కృష్ణా, గోదావరి జలాల అంశంపై శాసనసభలో పార్టీ సభ్యులంతా గట్టిగా వాదించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Krishna Godavari Water Issues: సవాల్‌ మనమే విసిరాం... సిద్ధంగా ఉండండి!

  • కేసీఆర్‌ వాదనకు కౌంటర్లు తయారు చేయండి.. పాలమూరు-రంగారెడ్డిపై గట్టిగా వాదించాలి

  • 1న పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌కు రావాలి

  • కృష్ణా బేసిన్‌ ఎమ్మెల్యేలదే ప్రధాన బాధ్యత

  • సమావేశాలకు అందరూ రావాల్సిందే

  • దిశానిర్ధేశం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి జలాల అంశంపై శాసనసభలో పార్టీ సభ్యులంతా గట్టిగా వాదించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. జనవరి 2 నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డితో పాటు కృష్ణా జలాల అంశం చర్చకు రానున్న నేపథ్యంలో సోమవారం అందుబాటులో ఉన్న మంత్రులు, ప్రభుత్వ విప్‌లతో అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృష్ణా, గోదావరి జలాల కేటాయింపు, తదితర అంశాలపై గడిచిన పదేళ్లలో ఏం జరిగింది? కాంగ్రెస్‌ వచ్చాక తీసుకున్న చర్యలు ఏంటి? లాంటి అన్ని విషయాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరించేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు సన్నద్ధం కావాలని కోరారు. నీటి విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా సాగునీటి అంశంపై అధికార పక్ష సభ్యులు పట్టు సాధించాలని పిలుపునిచ్చారు. కృష్ణా జలాలపై కొత్త సంవత్సరం తొలిరోజు ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఇచ్చే పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌కు సభ్యులంతా హాజరవ్వాలని ఆదేశించారు. ప్రధానంగా కృష్ణా పరీవాహక ప్రాంతాల ఎమ్మెల్యేలు పాలమూరు-రంగారెడ్డితో పాటు బేసిన్‌ పరిధిలోని ప్రాజెక్టులపై సమగ్ర సమాచారాన్ని దగ్గర ఉంచుకోవాలని చెప్పారు. అదనపు సమాచారం కావాలన్నా, అనుమానాలున్నా వెంటనే అధికారులను సంప్రదించి వివరాలు తీసుకోవాలని ఆదేశించారు. జనవరి 2 నుంచి మొదలయ్యే సమావేశాలకు ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా హాజరవ్వాల్సిందేనని చెప్పారు. అత్యవసర పనులు వాయిదా వేసుకోవాలన్నారు. సబ్జెక్టుతో గట్టిగా వాదిస్తూ విపక్షాలకు ఎదుర్కొనేందుకు సభ్యులు సిద్ధంగా ఉండాలన్నారు. సభ్యులంతా హాజరయ్యేలా చూడటం, సంబంధిత సబ్జెక్టులపై అవగాహన కల్పిస్తూ సభలో మాట్లాడే విధంగా సిద్ధం చేయడం వంటి బాధ్యతలను మంత్రులు, విప్‌లకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. సాగునీటి ప్రాజెక్టులు, కొత్త ఆయకట్టుకు సంబంధించి మాట్లాడేందుకు అసెంబ్లీకి రావాలని మనమే సవాల్‌ విసిరి కేసీఆర్‌ను ఆహ్వానించామని, ఆయన వచ్చినా, రాకపోయినా అప్పగించిన బాధ్యత నెరవేర్చేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ‘‘సభకు వచ్చినా ఏవో కథలు చెప్తాడు, వాటికి సబ్జెక్టుతో సరైన సమాధానాలను సిద్ధం చేసుకొని గట్టిగా బదులివ్వాలి’’ అని సూచించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు అంశం కూడా సభలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

Updated Date - Dec 30 , 2025 | 05:54 AM