Chief Minister Revanth Reddy urged: పర్యాటకంలో పెట్టుబడులు పెట్టండి
ABN , Publish Date - Sep 28 , 2025 | 02:23 AM
తెలంగాణ రాష్ట్రం పర్యాటకానికి గమ్యస్థానంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో, హైదరాబాద్‌లో అనేక పర్యాటక కేంద్రాలు, పురాతన, వారసత్వ కట్టడాలు...
రక్షణ కల్పిస్తాం.. లాభాలు తెప్పించే బాధ్యత తీసుకుంటాం.. ప్రభుత్వాలే మారాయి.. విధానాలు కాదు: రేవంత్
రూ.15,279 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
హైదరాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం పర్యాటకానికి గమ్యస్థానంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో, హైదరాబాద్‌లో అనేక పర్యాటక కేంద్రాలు, పురాతన, వారసత్వ కట్టడాలు, ఆలయాలు ఉన్నాయని తెలిపారు. పర్యాటకరంగ పెట్టుబడిదారులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఆ పెట్టుబడులకు తమ ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని, లాభాలు తెప్పించే బాధ్యత కూడా తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పర్యాటక శాఖ శిల్పారామంలోని సంప్రదాయ వేదికలో నిర్వహించిన ‘పర్యాటక సదస్సు’కు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో రాష్ట్రంలో పర్యాటకరంగ విధానమంటూ లేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. న్యూయార్క్‌లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, కొన్ని దేశాల్లో ఈఫిల్ టవర్, డిస్నీ వరల్డ్ వంటి పర్యాటక కేంద్రాలున్నట్లు.. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో చార్మినార్, గోల్కొండ కోట, రామోజీ ఫిల్మ్‌సిటీ వంటి పర్యాటక కేంద్రాలున్నాయని అన్నారు. వీటితోపాటు అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారె్‌స్టలు, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం, వేయి స్తంభాల గుడి, అలంపూర్ శక్తిపీఠం ఉన్నాయన్నారు.
ప్రపంచంతో పోటీ పడాలనుకుంటున్నాం..
తెలంగాణలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజంతోపాటు మెడికల్ టూరిజం కూడా అభివృద్ధి చెందుతోందని సీఎం రేవంత్ అన్నారు. ఆసియా దేశాలు, మధ్య ప్రాచ్య దేశాల నుంచి ప్రజలు వైద్యసేవల కోసం హైదరాబాద్‌కు వస్తున్నారని తెలిపారు. న్యూయార్క్, టోక్యో వంటి నగరాలతో పోటీ పడాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ‘‘గతంలో ఓవైపు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుండగా.. హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలను నిర్వహించాం. అంటే హైదరాబాద్ ఎంత భద్రంగా ఉంటుందో గమనించాలి. అత్యంత భద్రమైన నగరంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. శాంతిభద్రతలు, పెట్టుబడుల రక్షణ, పర్యాటకుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని సీఎం భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారాయే తప్ప.. విధానాలు మారలేదని చెప్పారు. ‘‘1994 నుంచి 2004 వరకు చంద్రబాబు ప్రభుత్వం, 2004 నుంచి 2014 వరకు రాజశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, 2014 నుంచి 2023 వరకు చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం, ఇప్పుడు నా ప్రభుత్వం ఉన్నాయి. మేమెప్పుడూ మా పాలసీలను మార్చుకోలేదు’’ అని అన్నారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో 30 పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు రూ.15,279 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. దీంతో 19,520 మందికి ప్రత్యక్షంగా, మొత్తం సుమారు 50వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశముంది. ఇందులో రూ.7,081 కోట్లతో 14 పీపీపీ ప్రాజెక్టులు, రూ.8,198 కోట్ల వ్యయంతో ప్రైవేట్ రంగంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉన్నతాధికారులు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు.